Chandrababu : ప్రభుత్వ ప్రోత్సాహంతోనే నాపై దాడులు.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Chandrababu (2)
Chandrababu Letter President And PM : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు తొమ్మిది పేజీల లేఖ రాశారు.
తనపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు.
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా వేదిక కూల్చివేత, దేవాలయాలపై దాడులు, గంజాయి అమ్మకాలు, శాంతి భద్రతలను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.
తాజాగా చిత్తూరు జిల్లాలో తనపైనే హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పుంగనూరు, అంగళ్లలో జరిగిన ఘటనలకు సంబంధించిన అంశాలను ఢిల్లీ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.