Cm Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు.. కీలక అంశాలపై చర్చ
పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు.
Cm Chandrababu: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. ఉదయం నుంచి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, వాటికి అవసరమైన నిధులు, అనుమతులపై చర్చిస్తున్నారు. ఉదయం కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. అలాగే ఓడ రేవుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తోనూ భేటీ అయ్యారు.
ముందుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరిస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం-నల్లమల సాగర్‌కు తక్షణ సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే గోదావరి జలాల పంపకాలపై వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు.
సీఆర్ పాటిల్ తో సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు నేరుగా పార్లమెంటుకు వెళ్లారు. పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, ఆర్థిక సాయంపై చర్చించారు. రాబోయే బడ్జెట్‌లో ఏపీ పెండింగ్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. తర్వాత కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్ తో భేటీ అయ్యారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. షిప్ బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని సోనోవాల్ ను చంద్రబాబు కోరారు. నేషనల్ మెగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటునకు సన్నద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం 3వేల 488 ఎకరాలు భూమి సమకూర్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు.
Also Read: ఏపీలో “రౌడీషీటర్ల బహిష్కరణ” పొలిటికల్ ఇష్యూ కాబోతోందా?
