Thalliki Vandanam : తల్లికి వందనం రూ.15,000 ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన
ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్నా వారందరికీ ఈ స్కీమ్ కింద రూ.15 వేలు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Thalliki Vandanam : ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. అందులో కీలకమైన హామీ తల్లికి వందనం. కూటమి ప్రభుత్వం వచ్చాక తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తోంది.
ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలవుతున్నాయి. ఇక, కొన్ని రోజుల్లో తల్లికి వందనం స్కీమ్ అమల్లోకి రానుంది. తల్లికి వందనం స్కీమ్ కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్నా వారందరికీ ఈ స్కీమ్ కింద రూ.15 వేలు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజాగా ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇచ్చేది ఎప్పుడో ఆయన చెప్పేశారు. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామన్నారు చంద్రబాబు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ తల్లికి వందనం స్కీమ్ అమలుపై కీలక చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్ లోగా తల్లికి వందనం అమలు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఎన్నికల్లో హామీ మేరకు ప్రతి ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ పథకాన్ని వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇస్తారు.
గత వైసీపీ సర్కార్ అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేసేది. తాము అధికారంలోకి వచ్చాక ఇంట్లో స్కూల్ కి వెళ్లే విద్యార్థులు ఎంతమంది ఉన్నా వారందరికీ తల్లికి వందనం పేరుతో తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.15వేలు చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేలా, ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి చదువు ఆపేయకుండా ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
”ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం అని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం. ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అలాగే, రైతుభరోసా అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 20వేల రూపాయలు ఇస్తాం. ప్రతి రైతుకు రైతుభరోసా కింద 20వేలు ఇస్తాం.
Also Read : ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతుంటే.. జగన్ ఇకపై రారుగా అని అందరూ అడుగుతున్నారు- నారా లోకేశ్
కేంద్రం 6 వేలు ఇస్తుంది. మనం 14వేలు ఇస్తాం. రెండూ మ్యాచ్ చేసి 20వేలు ఇస్తాం. ఇక మత్స్యకారులకు 20వేలు ఇస్తామన్నాం. చేపల వేటకు వెళ్లని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా హాలీడే ఇస్తాం. ఆ హాలీడే సమయం ముందుగానే వారికి ఇవ్వాల్సిన 20వేల రూపాయల ఆర్థిక సాయం చేసి వారిని కూడా ఆదుకుంటాం.
ఇప్పటికే డీఎస్సీ అనౌన్స్ చేశాం. త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16వేల 384 ఉద్యోగాలు రిక్రూట్ చేసి, ట్రైనింగ్ చేసి, పోస్టింగ్స్ ఇచ్చి, స్కూల్స్ ఓపెన్ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం” అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు చంద్రబాబు.