Chandra Babu Birthday: సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ.. ప్రధాని మోదీ, జగన్ సహా..

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Chandra Babu Birthday: సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ.. ప్రధాని మోదీ, జగన్ సహా..

CM Chandrababu Naidu

Updated On : April 20, 2025 / 11:43 AM IST

Chandra Babu Birthday: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు చంద్రబాబు సేవలు అందిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలతోపాటు వివిధ రంగాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ‘నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టిసారించి ఆయన పనిచేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్సు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ మోదీ తెలిపారు.

సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు గారికి వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్ వేదికగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు.‘‘ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’’ అని పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నట్లు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకుడు చంద్రబాబు. ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. 75వ జన్మదిన శుభాకాంక్షలు’’ తెలిపారు.

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలని. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజా సేవలో సుదీర్ఘ కాలం ఉండాలని” ఆకాంక్షిస్తున్నానని గవర్నర్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.