రౌడీయిజం, హింస, అక్రమాలు కనిపించకూడదు- అధికారులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గత ప్రభుత్వ పాలనకు, ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీషీట్లు ఎత్తేయాలన్నారు.

రౌడీయిజం, హింస, అక్రమాలు కనిపించకూడదు- అధికారులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Cm Chandrababu Naidu : ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల కుప్పం పర్యటన ముగిసింది. కుప్పంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానం అన్నారు సీఎం. అలాగే అధికారులు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలన్నారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు కనిపించకూడదన్నారు.

రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీషీట్లు ఎత్తేయాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం చుడతామన్నారు. గత ప్రభుత్వ పాలనకు, ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు ఇప్పటికే చెప్పానని తెలిపారు.

తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటన ముగించుకునే క్రమంలో సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో (కలెక్టర్ సహా జిల్లా యంత్రాంగం) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, చంద్రబాబు చేసిన కామెంట్స్ ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో సంబంధించనవి కావు. రాష్ట్రంలో ఉన్న అందరు అధికారులకు చంద్రబాబు వ్యాఖ్యలు వర్తిస్తాయి. సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్.. ఇదే నినాదంతో వచ్చే ఐదేళ్లు ముందుకు వెళ్లబోతున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా, సూటిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వంలో ఎలాంటి హంగామా కానీ, హడావుడి కానీ ఏమీ ఉండదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు.

అధికారులు ఎఫెక్టివ్ గా ఉండాలని చెప్పారు. అధికారులు ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. సాయంత్రం 6 గంటల తర్వాత అధికారులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదన్నారు. తప్పనిసరి అయితేనే సాయంత్రం 6 గంటల తర్వాత అధికారులతో సమీక్షలు జరుపుతాము తప్ప.. ఈలోగానే అన్నీ ముగిస్తామని అధికారులతో స్పష్టంగా చెప్పారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లలో బహుశా వైసీపీ పార్టీ నేతలు ఒత్తిడి తేవడంతో కొందరు అధికారులు ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని, దాన్ని మేము అర్థం చేసుకోగలమన్నారు చంద్రబాబు. అయితే వచ్చే ఐదేళ్లు మాత్రం అధికారులు కొత్త ప్రభుత్వం శైలికి తగ్గట్లుగా నడుచుకోవాల్సి ఉంటుందని చాలా స్పష్టంగా అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

మనం ఏ వర్గాన్ని కూడా ఇబ్బంది పెట్టబోమని చంద్రబాబు అన్నారు. ఇక, గత ఐదేళ్లలో రాజకీయ ఒత్తిళ్లతో చాలామంది అమాయకులపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని, వాటని ఒకసారి విచారించాలని, అమాయకులపై పెట్టి ఉంటే, వెంటనే రౌడీషీట్లు ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. జిల్లా కలెక్టర్, మొత్తం జిల్లా యంత్రాంగం పాల్గొన్న ఈ సమావేశంలో.. చంద్రబాబు మనసు విప్పి, చాలా ఓపెన్ మైండ్ తో అధికారులతో మాట్లాడారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన చాలా వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగానికి కూడా వర్తిస్తాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మా మంత్రులు, వారి కాన్వాయ్ హంగామా చేస్తూ రోడ్లపై వెళ్లే పరిస్థితి ఇకపై కనిపించదన్నారు చంద్రబాబు. నేను సైతం అతి సామాన్యుడిగానే ఉంటాను అంటూ అధికారుల దగ్గర ప్రస్తావించారు చంద్రబాబు. మొత్తంగా గంటన్నరపాటు ఈ మీటింగ్ జరిగింది.

Also Read : త్వరలోనే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం?- ఎమ్మెల్యే నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు