త్వరలోనే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం?- ఎమ్మెల్యే నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసేందుకు జగన్ కొన్ని ఆంక్షలు పెట్టారని అన్నారు.

Ysrcp Merge In Congress : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఆయన అన్నారు. అందుకోసమే జగన్ బెంగళూరులో ఉంటూ చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పార్టీ నుంచి చేజారిపోతారనే భయంతోనే కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు జగన్ కొన్ని ఆంక్షలు పెట్టారని అన్నారు. తన సోదరి షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితేనే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని జగన్ చెప్పినట్లు తనకు సమాచారం ఉందన్నారు.
”పులివెందుల పులి బెంగళూరులో తిరుగుతోంది. బెంగళూరులో ఎందుకు తిరుగుతోంది అంటే.. అక్కడ ఉన్న ఆస్తులను కాపాడుకోవాలి. అందుకోసమే అక్కడ తిరుగుతోంది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా డీకే శివకుమార్ జగన్ కుటుంబానికి సన్నిహితుడు. అదే విధంగా జగన్ కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా చాలా సన్నిహితుడు. జగన్ కు రాజకీయంగా భవిష్యత్తు ఏంటి అన్నది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. అసలు తనతో తన సహచరులు ఉంటారా? ఉండరా? అనే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అన్నింటికీ పరిష్కార మార్గంగా కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేస్తే మేలు అనే ఆలోచనకు జగన్ వచ్చాడు అనేది నాకు విశ్వసనీయ సమాచారం.
అయితే, విలీనానికి డీకే శివకుమార్ కు జగన్ ఒక కండీషన్ పెట్టారని చెబుతున్నారు. షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపేయాలని కండీషన్ పెట్టారు జగన్. ఇప్పటికే షర్మిలపై కాంగ్రెస్ లో దుమారం రేగుతోంది. ఎన్నికల నిధులను సక్రమంగా పంపణీ చేయలేదని, కాంగ్రెస్ లో ఉన్న ప్రధాన నాయకులు అందరూ షర్మిలపై దుమ్మెత్తిపోస్తున్నారు. అనేక మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు షర్మిలపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఆమెను తప్పించాలి, తనను లోపలికి తీసుకోవాలి అనేది జగన్ కండీషన్.
Also Read : అందుకే, ఘోరంగా ఓడిపోయాం..!- దిమ్మతిరిగిపోయే కారణాలు చెబుతున్న వైసీపీ లీడర్లు
దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి సంతానం ఇద్దరూ కూడా డబ్బు వ్యామోహంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. కడప జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఓడిన ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరూ కనీసం ముఖం చూడని పరిస్థితి. ఐదుగురు ఎమ్మెల్యేలను నేను తీసుకుంటున్నా. చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా రాదు అని స్పష్టంగా జగన్ చేసిన ప్రకటన వాస్తవమా? కాదా? ఆ రోజున ఏ ఉద్దేశంతో ఆ ప్రకటన చేశాడు? 18మంది కన్నా తగ్గితే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా రాదు అన్నది జగన్ ఎందుకు చెప్పారు? దానికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి” అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.