CM Chandrababu: ఆ విషయాల్లో రాజీ పడొద్దు.. తిరుమలలో అధికారులతో చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు అని చంద్రబాబు టీటీడీ అధికారులకు సూచించారు.

CM Chandrababu
CM Chandrababu Review in Tirumala: తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు రెండోరోజు పర్యటించారు. శుక్రవారం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా తిరుమల చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శనివారం ఉదయం తిరుమల కొండపై అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. తిరుమలలో ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు.. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. ఏ విషయంలోనూ రాజీపడొద్దు.. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి.. మరింత మెరుగుపడాలని సూచించారు.
Also Read : ఏపీ ప్రభుత్వం తరఫున తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దుని చంద్రబాబు టీటీడీ అధికారులకు సూచించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి చాలా పవర్ ఫుల్ దేవుడు.. ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేవారిని గౌరవించుకోవాలి. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపడాలని తెలిపారు.
ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశాలు కల్పించాలి. వారి సూచనల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని చంద్రబాబు అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఒక్క తిరుపతిలోనే కాదు.. అన్ని ఆలయాల్లోనూ భక్తుల అభిప్రాయాలను తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనంకు సూచించారు.
Also Read : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..
అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డూకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. పేటెంట్ ఉంది. ఎంతో మంది ప్రయత్నించినా తిరుమలలాంటి లడ్డూ చేయలేక విఫలమయ్యారు. తిరుమలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఏమేం చేయాలో అన్ని చర్యలు చేయమని టీటీడీని ఆదేశించానని చెప్పారు. హిందువులందరికీ ప్రతిబింబం తిరుమల క్షేత్రం. నాడు 2వేల మంది ఎన్టీఆర్ అన్నప్రసాదం వితరణ మొదలు పెట్టారు. నేడు 3లక్షల మందికి ఆహారం పెట్టేంత స్థాయికి ఎదిగింది. నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించడమే లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. గతంకంటే శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని సదుపాయాలు కల్పించాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. త్వరలో లడ్డూతో పాటు, ముడిసరుకుల నాణ్యతను పరిశీలించే అధునాతన ల్యాబ్ లు ఏర్పాటు చేస్తాం.. అవసరమైతే ఐఐటీ నిపుణుల సహకారం తీసుకోమని టీటీడీకీ సూచించడం జరిగిందని, తిరుమలను తిరిగి పవిత్రమైన, దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.