AP Fuel Shortage: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. సీఎం చంద్రబాబు సీరియస్.. ఆయిల్ కంపెనీలకు వార్నింగ్
సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
AP Fuel Shortage: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం లోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలని తేల్చి చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.*వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దని తేల్చి చెప్పారు చంద్రబాబు. ఆయిల్ కంపెనీలు ఉన్నపళంగా పాలసీలు మార్చి ఇబ్బంది పెడితే ఎలా? అని చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమస్య చక్కదిద్దేందుకు టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.
నయారా, రిలయన్స్, జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా తమ కంపెనీ బంకులకు సప్లయ్ నిలిపివేయడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేశాయని ముఖ్యమంత్రికి వివరించారు జిల్లా కలెక్టర్లు. కంపెనీలు రిటైల్ ఔట్ లెట్లకు ఇంతకుముందులా క్రెడిట్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ప్రశ్నించారు చంద్రబాబు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతుల విషయం పునరాలోచన చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆయిల్ కంపెనీల అసంబద్ద నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం సమస్యను గుర్తించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.
సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కసారిగా సమస్య తలెత్తడంపై విచారణ జరపాలన్నారు. ప్రతీ బంక్ దగ్గర రెవెన్యూ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరపాలన్నారు. ఎక్కడా బ్లాక్లో అమ్మకాలు జరగకూడదన్నారు. సోమవారం నాటికి ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని హుకుం జారీ చేశారు. రైతులకు కూపన్ విధానం పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
Also Read: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. బయటకు రావొద్దు.. తీవ్ర ఎండలు, వేడిగాలుల ముప్పు
