CM Jagan Compensation : లంకెవానిదిబ్బ మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్
గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బలో ఒడిశా కూలీల మృతి ఘటనపై సీఎం జగన్ స్పందించారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Cm Jagan
CM jagan Compensation : గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బలో ఒడిశా కూలీల మృతి ఘటనపై సీఎం జగన్ స్పందించారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. పరిహారం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మానవతా దృక్పథంతో సాయం అందించాలన్నారు. రొయ్యలచెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
లంకెవానిదిబ్బ గ్రామంలోని రొయ్యల చెరువుల వద్ద గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన 25 మంది యువకులు గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బలోని మండలి బెయిలీ అనే వ్యక్తికి చెందిన రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు 15 రోజుల క్రితం వచ్చారు. చెరువుల వద్ద ఉన్న షెడ్లలోనే వారంతా ఉంటున్నారు. ఎప్పటిలాగే గురువారం చెరువుల్లోని రొయ్యలకు మేత వేశారు.
రాత్రి వారంతా భోజనాలు చేసి షెడ్లలోని రెండు గదుల్లో నిద్రించారు. అర్ధరాత్రి వేళ షెడ్‌లోని ఒక గదిలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకుని పేలుడు సంభవించి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ గదిలో 10 మంది నిద్రిస్తుండగా వీరిలో నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ (18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.