Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎం జగన్ నుంచి పిలుపు.. ఏం జరుగుతోంది?

ఇప్పటికే రెండు మూడు సార్లు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చినా వసంత కృష్ణ ప్రసాద్ అందుబాటులో లేరు, నేను రాలేను అని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎం జగన్ నుంచి పిలుపు.. ఏం జరుగుతోంది?

Vasantha Krishna Prasad

Updated On : December 28, 2023 / 5:20 PM IST

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది. వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులు జరుగుతున్న సమయంలో తాడేపల్లికి రావాలని పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. నిత్యం వివాదాల్లో ఉంటుంది.

ఇప్పుడు ఎమ్మెల్యేల మార్పుతో మరోసారి మైలవరం పై ఫోకస్ పడింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కు పిలుపు వచ్చింది. జగన్ ను కలిసేందుకు ఆయనకు అపాయింట్ మెంట్ కూడా ఖరారైంది. కాగా, ఇప్పటికే రెండు మూడు సార్లు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చినా వసంత కృష్ణ ప్రసాద్ అందుబాటులో లేరు, నేను రాలేను అని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

Also Read : పవన్ కల్యాణ్ వేట.. గెలుపు గుర్రాల ఎంపిక కోసం స్వయంగా రంగంలోకి, ముందుగా అక్కడి నుంచే

మార్పులు చేర్పులు నేపథ్యంలో మైలవరం టికెట్ విషయంలో ఇదివరకే చర్చ జరిగింది. ఈసారి మైలవరం టికెట్ వసంత కృష్ణ ప్రసాద్ కి లేదని చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధిష్టానానికి టచ్ లో లేకుండా పూర్తిగా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అనే నిర్ణయాన్ని వసంత కృష్ణ ప్రసాద్ హైకమాండ్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సన్నిహితులతో చెప్పినట్లుగా సమాచారం. ఈ పరిస్థితుల్లో మరోసారి తాడేపల్లి నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు పిలుపు వచ్చింది.

ముందు నుంచి కూడా మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేశ్ కు విభేదాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయాలని జోగి రమేశ్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి తాడేపల్లికి పిలిపించి సమాచారం ఇస్తున్నారు సీఎం జగన్. సజ్జల రామకృష్ణా రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లు కూడా వారితో మాట్లాడుతున్నారు. ఈసారి ఎందుకు టికెట్ ఇవ్వలేదో వారికి వివరిస్తున్నారు. ఇదే విధంగా వసంత కృష్ణ ప్రసాద్ ను పది రోజుల క్రితం పిలిపించి మాట్లాడారు. అప్పటి నుంచి కూడా ఆయన అధిష్టానానికి దూరంగా ఉన్నారు.

Also Read : నారా లోకేశ్‌తో వట్టి పవన్ భేటీ.. ఉంగుటూరు సీటు కోసమేనా?

వచ్చే ఎన్నికల్లో పూర్తిగా దూరం ఉండబోతున్నా, రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నా అనే సంకేతాలు అధిష్టానికి ఇచ్చేశారు వసంత కృష్ణ ప్రసాద్. ఈ పరిస్థితుల్లో జగన్ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్ తో భేటీ తర్వాత మైలవరం టికెట్ కు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మైలవరం టికెట్ కృష్ణ ప్రసాద్ కే ఇస్తారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అనే విషయాన్ని నేరుగా ఆయనకే చెప్పేయనున్నారు సీఎం జగన్.