ఇంటివద్దకే ఫించన్లు : జగన్ సర్కార్ రికార్డు

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినూత్నంగా దూసుకెళుతున్నారు సీఎం జగన్. కొత్త కొత్త పథకాలు చేపడుతూ…ప్రజల ముందుకు వెళుతున్నారు. నవరత్నాలు, వైసీపీ మేనిఫెస్టోలో వెల్లడించిన విధంగా పలు హామీలను అమలయ్యే విధంగా చూస్తున్నారు. అందులో ప్రధానమైంది ఫించన్ల పింపిణీ. ఇంటివద్దకే ఫించన్ల పంపిణీ చేస్తామని వైసీపీ చెప్పింది. తాజాగా ఇందులో రికార్డు బ్రేక్ చేసింది వైసీపీ ప్రభుత్వం.
2020, మార్చి 01వ తేదీ ఆదివారం ఉదయం పొద్దు పొడవకముందే..ఫించన్ల పంపిణీ ప్రారంభం చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో గ్రామ వాలటీర్ల సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ఆదివారమైనా..లబ్దిదారులకు ఫించన్ నగదు అందచేశారు. ఉదయం 4 గంటల నుంచే పంపిణీని ప్రారంభించారు. పింఛన్ల పంపిణీ కోసం వాలంటీర్లు ఉదయాన్నే గ్రామాల్లో వాలిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలాహలం నెలకొంది.
పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 13 జిల్లాలో మధ్యాహ్నం 2గంటల వరకు 60 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు అధికారులు. ఇప్పటికే గడగడపకూ పెన్షన్ల కార్యక్రమంలో సమస్యలను గుర్తించిన అధికారులు.. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున డిజిటల్ మ్యాపింగ్ పూర్తి చేశారు. వేలిముద్రలు, ఐరిస్, ఫేస్ రికగ్నైజేషన్ విధానాల్లో పింఛన్ డబ్బులు అందిస్తున్నారు.
ఫించన్ల కోసం పడిగాపులు, క్యూ లైన్లు, లంచాలు లేకుండా…వ్యవస్థ తీసుకరావాలని వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే ఫించన్లు కార్యక్రమం చేపట్టింది. మారుమూల ప్రాంతాల్లో సైతం ఫించన్లను పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. లబ్దిదారుల ఇంటి వద్దకే ఫించన్ సందర్భంగా 2020, ఫిబ్రవరి నెలలో ఎదురైన సమస్యలను చెక్ పెట్టారు అధికారులు.
కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం అల్లాపురంలో ఇంటింటికీ వెళ్లి జిల్లా కలెక్టర్ MD.ఇంతియాజ్ అహ్మద్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు ఎండివో సుభాషిణి , ఈవోపిఆర్డి , ఏపివో పలువురు అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి వార్డ్ లో గత రెండు నెలలుగా పెన్షన్లు రావడం లేదని కొంతమంది వితంతువులు వాలంటీర్లతో ఘర్షణకు దిగారు. గత నెలలో అడిగితే ఈ నెలలో ఇస్తామని అన్నారని.. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే… ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు… అక్కడికి చేరుకొని వారికి పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని దివ్యాంగులు, వృద్ధులు అంటున్నారు. గతంలో పింఛన్ కోసం వెళ్లాలంటే… గంటల తరపడి లైన్‌లో నిల్చుని చాలా ఇబ్బందులు పడేవాళ్ల… ఇప్పుడు ఇంటి వద్దే పింఛన్ అందిస్తుండటంతో సంతోషంగా ఉందంటున్నారు లబ్ధిదారులు.
Read More : కరోనా వైరస్ : ఫేస్ మాస్క్‌లు కొనొద్దంటున్న అమెరికా డాక్టర్