మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది.. చంద్రబాబుకి ఓటు వేశారో..: జగన్
జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, బాబుకి ఓటు వేస్తే మాత్రం..

మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలను ఉద్దేశించి అన్నారు. పి.గన్నవరం అంబాజీపేటలో జగన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, బాబుకి ఓటు వేస్తే పథకాలు అన్నీ పోతాయని చెప్పారు.
ఎన్నికల యుద్ధానికి సిద్ధమేనా అని ప్రజలను జగన్ అడిగారు. ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని చెప్పారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్లేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ సాధ్యంకాని హామీలిస్తున్నారని తెలిపారు.
వైసీపీ మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేశామని జగన్ చెప్పారు. తాము రూ.2.70 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. లంచాలు, వివక్షకు తావులేకుండా చేశామని చెప్పారు. రాష్ట్రంలో పౌరసేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. పేదవాళ్లకు మంచి చేసినందుకు జగన్ ను ఓడించాలా? అని అన్నారు. ఎన్నికల వేళ విపక్షాలు అన్నీ కలిసి తనపై యుద్ధానికి వస్తున్నారని అన్నారు. తాను ప్రజలను నమ్ముకునే ఎన్నికల్లోకి వెళ్తున్నానని చెప్పారు.
Also Read: మరో రెండేళ్లలో దేశంలో జరిగేది ఇదే..: కొత్తగూడెంలో జేపీ నడ్డా