ఏం జరుగుతోంది : ప్రగతి భవన్ లో కేసీఆర్, జగన్ ఏకాంత భేటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం అయ్యారు. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం సీఎం జగన్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రగతిభవన్ లో జగన్, కేసీఆర్ లంచ్ చేశారు. ఆ తర్వాత ఇరువురూ భేటీ అయ్యారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, విభజన సమస్యలు, ఉమ్మడి ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. జలవనరుల వినియోగం, పోతిరెడ్డిపాడు వివాదంపైనా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. 3 నెలల విరామం తర్వాత ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు.
విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చిస్తున్నట్టు సమాచారం. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్‌లోనే మూడు సార్లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో జరిగిన సమావేశాల్లో.. అధికారులు, మంత్రులు పాల్గొంటే… ఈసారి మాత్రం కేవలం ఇద్దరు సీఎంలు మాత్రమే భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
మూడున్నర నెలల తర్వాత ఇవాళ(జనవరి 13,2020) మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఇద్దరు సీఎంలు సమావేశం అయ్యారు. కేసీఆర్, జగన్ సమావేశంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ లాంటి కీలక అంశాలపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. సీఏఏకు వైసీపీ మద్దతు తెలిపినా… ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కేంద్రం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ బిల్లుల్ని వ్యతిరేకించాలంటూ ఎంఐఎం డిమాండ్ చేస్తోంది.
ఈ వ్యవహారంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే గతంలో చర్చించిన నదుల అనుసంధానంతో పాటు ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన కూడా వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. రెండు రాష్ట్రాలు ఏర్పడి ఆరేళ్లు గడుస్తున్నా విభజన అంశాల్లో చాలా వరకు అపరిష్కృతంగానే ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగుల పంపకం, ఢిల్లీలో తెలంగాణ భవన్ విభజనతో పాటు 9,10 షెడ్యూళ్లలోని అంశాలపైనా ఇద్దరు సీఎంలు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : బిగ్ బ్రేకింగ్ : బీజేపీతో జనసేన పొత్తు..?