విశాఖలో కరోనా : భయపడొద్దు అంటున్న వైద్యులు

విశాఖలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం, వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా ప్రబలుతున్న క్రమంలో..విశాఖలోని చెస్ట్ హాస్పిటల్‌ని పూర్తిగా కోవిడ్ – 19 ఆసుపత్రిగా మార్చేశారు. ప్రస్తుతం పాజిటివ్ అని తేలిన వ్యక్తి..ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యాధికారి వెల్లడించారు.
కరోనాను ఎదుర్కొనేందుకు తాము అప్రమత్తంగా ఉన్నామని, విశాఖ వాసులు భయాందోళనలకు గురి కావద్దని చెస్ట్ హాస్పిటల్ సూపరిటెండెంట్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈయనతో 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం 10tv మాట్లాడింది. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వ్యక్తికి 65 సంవత్సరాలు ఉంటాయన్నారు. ఇతను మక్కా నుంచి ముంబైకి వెళ్లారని, అనంతరం హైదరాబాద్ కు వచ్చి..వైజాగ్ వచ్చారన్నారు.
చివరి జర్నీ ట్రైన్ ద్వారా జరిగిందని, ఇతనికి డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉందన్నారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏర్పడడంతో మర్రిపాలెంలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి..పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. పరీక్షలు చేసిన వైద్యులు…విశాఖ చెస్ట్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారన్నారు. ఇక్కడకు వచ్చిన వృద్ధుడిని పరీక్షించిన అనంతరం కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందన్నారు.
వెంటనే శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపించామని, ఐసోలేషన్ వార్డులో ఉంచామన్నారు. ఇతని కుటుంబసభ్యుల గురించి ఆరా తీస్తున్నట్లు, వీరికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరం బట్టి..చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
Read More :కరీంనగర్‌లో హై అలర్ట్ : హైపోక్లోరిన్ స్ర్పే..ఇంటి నుంచి బయటకు రావొద్దు