కరోనా కట్టడికి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..ఆసుపత్రుల సంఖ్య పెంపు

  • Published By: madhu ,Published On : August 21, 2020 / 02:00 PM IST
కరోనా కట్టడికి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..ఆసుపత్రుల సంఖ్య పెంపు

Updated On : August 21, 2020 / 2:50 PM IST

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రబలుతున్న తీరు, తీసుకుంటున్న చర్యలపై వైద్యులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.



కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య 138 నుంచి 287కు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. స్సెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కోవిడ్‌ కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని, కోవిడ్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు.

ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అందిస్తున్న సేవలకు అనుగుణంగా కోవిడ్‌ ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలన్నారు. ఇప్పుడున్న 287 ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్త స్థాయిలో ఉండాలన్నారు.



నిరంతరంగా ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించే విధంగా చూడాలని, కోవిడ్‌ కాల్‌ సెంటర్‌లు సమర్థవంతంగా పని చేయాలన్నారాయన. ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లు సమర్థవంతంగా పని చేయాలని, చికిత్స తీసుకుంటున్నవారికి మంచి భోజనం అందాలన్నారు. హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి సేవలు, మందులు ఇవ్వడం, చికిత్స అందించడం, వారి సందేహాలు ఎప్పటికప్పుడు తీర్చడం, సమాధానాలు ఇచ్చే వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నారు.

‘ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందాలి. ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సేవలు కోరుకుంటామో ఆ విధానాలు కచ్చితంగా అమలు కావాలి. రిఫరల్‌ ప్రోటోకాల్‌ చాలా స్పష్టంగా ఉండాలి. విలేజ్, వార్డు క్లినిక్స్‌ నుంచి ఈ ప్రోటోకాల్‌ అమలు జరగాలి. ఆరోగ్యశ్రీ సేవల సమాచారం తెలుసుకొనేందుకు, ఫిర్యాదులు చేసేందుకు ఒక కాల్‌సెంటర్‌ ఉండాలి. ఈ నంబర్‌ను అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో బోర్డుల్లో ఉంచాలి.



పేషెంట్‌ను ట్రీట్‌ చేయకుండా అవసరం లేకుండా రిఫర్‌ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని చెప్పాలి. ఆరోగ్య ఆసరా పనితీరును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’. అని సీఎం జగన్ సూచించారు.