నో సోషల్ డిస్టెన్స్ : విజయవాడలో నో మటన్, నో చికెన్ 

నో సోషల్ డిస్టెన్స్ : విజయవాడలో నో మటన్, నో చికెన్ 

Updated On : June 21, 2021 / 3:12 PM IST

ఈసారి కూడా విజయవాడ వాసులకు ముక్క దొరికే ఛాన్స్ లేదు. కరోనా రాకాసి మూలంగా మాంసాహార దుకాణాలు తెరవడానికి ఫర్మిషన్ ఇవ్వడం లేదు. దీని కారణంగా ముక్క లేకుండానే తినాల్సి వస్తోంది. ఒకవేళ షాపులు తెరిస్తే కొరడా ఝులిపిస్తున్నారు. కరోనా వైరస్ ఎప్పుడు పోతుందో..అని అనుకుంటున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం వల్లే తాము ఈ విధంగా చేయాల్సి వస్తుందని అంటున్నారు అధికారులు.

ఏపీలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాలను గుర్తించి ప్రజలు బయటకు రాకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా విజయవాడలో అధికంగా కేసులు అధికమయ్యాయి. 120 కేసులు ఎక్కువ కావడంతో అధికారయంత్రాంగం మరింత అలర్ట్ అయ్యింది. నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం మటన్, చికెన్, ఇతర మాంసాహార దుకాణాలను క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని, వీరిని నియంత్రించడం కష్టతరమౌతోందంటున్నారు. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది విజయవాడ వాసుల పరిస్ధితి. కరోనా వ్యాప్తి చెందుతుంది, లాక్‌డౌన్‌ను పాటించండి, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావొద్దని అధికారులు మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా  కృష్ణాజిల్లా వాసులను వణికించే రేంజ్ కు  కరోనా తీవ్రత పెరిగింది. జిల్లాలో ఏకంగా 127 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు.  కృష్ణాజిల్లా వ్యాప్తంగా 127 పాజిటివ్ కేసులు నమోదైతే ఒక్క విజయవాడలోనే 101 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బెజవాడ వాసుల్లో మరింత ఆందోళన మొదలైంది. మొదటి నుంచి విదేశీయులు, ఢిల్లీ మర్కజ్ కేసులతో ఉక్కిరిబిక్కిరైన విజయవాడ ప్రజలు… కొత్తగా నమోదవుతున్న కేసులతో ఇళ్ళ నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

కృష్ణా జిల్లాలో 1646 మంది అనుమానితులకు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందలో 615 మంది రిపోర్టులు రాగా… 127 మందికి పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. మరో 1031 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా 2443 మంది హోమ్‌ క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు. మరోవైపు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్ళి వచ్చిన వారు దాదాపుగా క్వారంటైన్ పూర్తి చేసినప్పటికీ మరికొంతమంది మాత్రం హాస్పిటల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. జిల్లాలో నమోదైన  127 కేసుల్లో…  29 మంది డిశ్చార్జికాగా.. 8మంది చనిపోయారు.  90 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.