క్వారంటైన్ పూర్తి చేసుకుని వెళ్లే పేదలకు సీఎం జగన్ గిప్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కరోనా మహమ్మారిని ప్రారదోలేందుకు సీఎం జగన్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఎన్ని పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరికి ఎలాంటి సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
వైద్యులు ప్రాణాలకు తెగించి..కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది డిశ్చార్జ్ అయ్యారు కూడా. తాజాగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లే పేదలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. 2020, ఏప్రిల్ 15వ తేదీ బుధవారం అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో కరోనా వైరస్ పై సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్ లో కేంద్రాల్లో కలిపిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు.
మెడికల్ ప్రోటోకాల్ అయిన తర్వాత..తిరిగి ఇళ్లకు పంపించే సమయంలో పేద బాధితులను గుర్తించి వారికి కనీసం రూ.2 వేలు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్ సూచించారు. కరోనాకు చికిత్స పొందుతున్న బాధితులకు భోజనం, ఇతర ఆహార పదార్థాల కోసం కనీసం రూ. 500, పారిశుధ్యం కోసం రూ. 50, ఇతరత్రా ఖర్చుల కోసం రూ. 50, ప్రయాణ ఖర్చుల కింద రూ. 300, తిరుగు ప్రయాణం కోసం రూ. మరో రూ. 300 అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వైరస్ వ్యాపించకుండా..తీసుకుంటున్న చర్యలు, క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర వివరాలను అధికారులు తెలియచేశారు.