Kakani Govardhan Reddy: పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి.. పోలీసులకు జడ్జి కీలక ఆదేశాలు..

ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం..

Kakani Govardhan Reddy: పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి.. పోలీసులకు జడ్జి కీలక ఆదేశాలు..

Updated On : June 6, 2025 / 12:53 AM IST

Kakani Govardhan Reddy: అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీకి నెల్లూరు ఎస్సీ ఎస్టీ ఐదో అదనపు కోర్టు అనుమతి ఇచ్చింది. కాకాణిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పోలీస్ కస్టడీకి సంబంధించి న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు.

కాకాణి తరపు న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని జడ్జి ఆదేశించారు. 6వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. కాకాణిని పోలీస్ కస్టడీకి ఇస్తూ తీర్పు వెల్లడించారు ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కోర్టు ఇంఛార్జ్ న్యాయమూర్తి సుమ.

శుక్రవారం ఉదయం కాకాణిని పోలీసులు తమఅదుపులోకి తీసుకోనున్నారు. పోలీస్ కస్టడీ అనంతరం కాకాణిని ఆదివారం సాయంత్రం 5గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నాలుగో నిందితుడి (ఏ4)గా మాజీ మంత్రి కాకాణి ఉన్నారు.

సుమారు రెండు నెలలు పోలీసులకు దొర్కకుండా తప్పించుకుని తిరిగారు కాకాణి. ముందస్తు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలే చేశారు. అయితే, ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో ఆయనకు నిరాశే ఎదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టులు కొట్టివేశాయి. దీంతో పోలీసులు కాకాణి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు.

Also Read: వైసీపీకి తొందర ఎక్కువైందా? నిరసనలకు ఇది సరైన టైమ్ కాదా?

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ, కాకాణి విచారణకు రాలేదు. అంతేకాదు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులన్నింటి నుంచి రక్షణ పొందేందుకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ, ఫలితం లేకపోయింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది.