Cyclone Michaung : ఏపీ వైపు ముంచుకొస్తున్న మిచాంగ్ ముప్పు.. అత్యంత క్లిష్ట సమయం, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు, స్కూళ్లకు సెలవులు

మిచాంగ్ తుపాను తీరం తాకే సమయంలో భయంకరంగా ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Cyclone Michaung : ఏపీ వైపు ముంచుకొస్తున్న మిచాంగ్ ముప్పు.. అత్యంత క్లిష్ట సమయం, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు, స్కూళ్లకు సెలవులు

Cyclone Michaung Fear (Photo : Google)

ముప్పు ముంచుకొస్తోంది. తీవ్ర తుపాను మిచాంగ్ భయపెడుతోంది. గజగజ వణికిస్తోంది. ఏపీ తీర ప్రాంతాల్లోని ప్రజల గుండెల్లో మిచాంగ్ వణుకు పుట్టిస్తోంది. మిచాంగ్ తుపాను తీరం తాకే సమయంలో భయంకరంగా ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తుపాను తీరం తాకే సమయంలో 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు విరుచుకుపడతాయని ఐఎండీ తెలిపింది. తీర ప్రాంత జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మిచాంగ్ తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ అలర్ట్ అయ్యారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. రాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్య బాపట్ల-మచిలీపట్నం మధ్య తుపాను తీరాన్ని అత్యంత బలంగా తాకే ప్రమాదం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. అవనిగడ్డలో తుపాను సహాయక చర్యలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 100 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తూ.. తుపాను తీరాన్ని దాటుతుందని తెలిపారు. ఈ రాత్రి అత్యంత క్లిష్ట సమయం అన్నారాయన.

తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లోని స్కూళ్లకు డిసెంబర్ 5వ తేదీన కూడా సెలవు ప్రకటించారు. కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో మంగళవారం స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. నెల్లూరు-మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటనుంది. దాని ప్రభావంతో కోస్తా జిల్లాలలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. చాంగ్ తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్.

Also Read : తీవ్ర తుపానుగా మిచాంగ్.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు

తుపాను ప్రభావంపై కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక విజ్ఞప్తి చేశారు. తుపాను నేపథ్యంలో దీవుల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఏటిమొగ, నాచుగుంట, ఈల చెట్ల దిబ్బ దీవుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా బయటకు వచ్చేందుకు, NDRF బృందాలు వెళ్లేందుకు బోట్లు ఏర్పాటు చేశామన్నారు.

తిరుమల ఘాట్ రోడ్లలో ఆంక్షలు విధించారు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఘాట్ రోడ్లలో రాత్రి 8 గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇచ్చారు.

ప్రకాశం జిల్లా కొండేపిలో మిచాంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావం దాటికి ఇళ్లకే పరిమితమయ్యారు స్థానికులు. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. కరెంటు స్థంభాలు విరిపోయాయి. బలమైన ఈదురుగాలుల ధాటికి 33 కేవి విద్యుత్ లైన్ బ్రేక్ అయ్యింది. దాంతో కొండేపితో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో అంధకారం నెలకొంది.

Also Read : ధైర్యంగా ఉండండి, మేము మీతోనే ఉన్నాము.. చెన్నైలో వర్ష బీభత్సంపై కవిత ట్వీట్

కృష్ణా జిల్లాలో తుపాను సహాయ చర్యలకు 200 మంది పోలీసులను రంగంలోకి దించారు. మిచాంగ్ తుపాను ప్రభావం నేపథ్యంలో నాగాయలంక మండలంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు జిల్లా ఎస్పీ జాషువా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సుమారు 200 మంది పోలీసు అధికారులు సిబ్బందితో ఎస్పీ జాషువా నాగాయలంకకు చేరుకున్నారు. సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది నాగాయలంక నుంచి లోతట్టు ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు.