YSRCP: ఆ వైసీపీ సీనియర్ నేత అందుకే గుమ్మం దాటట్లేదా?
ప్రజెంట్ పాలిటిక్స్‌లో కొనసాగడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు.

ధర్మాన ప్రసాదరావు.. సీనియర్ మోస్ట్.. నాన్ కాంట్రవర్సీ లీడర్. పైగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే కాదు..తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌లో పరిచయం అక్కరలేని పేరు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి మొదలు.. వైఎస్ జగన్ వరకు అనేక మంది సీఎంల క్యాబినెట్‌లో కీలక శాఖలు నిర్వహించారు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ధర్మాన..హోదా, స్థాయి, గౌరవానికి తగ్గట్లుగా..సాదాసీదాగా హుందాగా పని చేసుకుంటూ వెళ్తుంటారు.
అయితే వైసీపీ ఓటమి తర్వాత ధర్మాన పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోవడం చర్చనీయాంశమవుతోంది. ఏడాదిగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా ఆయన కనిపించడం లేదు. బయటి జనానికే కాదు చివరికి వైసీపీ ముఖ్య నాయకులకు కూడా ధర్మాన దర్శన భాగ్యం దక్కడం లేదట. అయితే కొత్త ప్రభుత్వానికి కాస్త టైం ఇవ్వాలి, ప్రతి అంశంలో విమర్శలు చేయకూడదని మొదట్లో ధర్మాన చెప్పడంతో క్యాడర్, లీడర్లు కూడా కరెక్టే కదా అనుకున్నారట. కానీ ఏడాది అయినా నో కామెంట్ అంటూ సైలెంట్ మోడ్‌లో ఉండటంతో ఆయన మదిలో ఏముందో అర్థం కాక క్యాడర్ అయోమయంలో ఉందట.
Also Read: చాలా కాలం తర్వాత గుడివాడలో కనపడిన మాజీమంత్రి కొడాలి నాని
ప్రతిపక్షంలోకి వచ్చాక ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదు ధర్మాన. దీంతో క్యాడర్‌కు రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయట. ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన నాయకుడు ఇప్పుడు ఇలా ఎందుకు ఉన్నారంటూ అటు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా చర్చ నడుస్తోందట. ఎన్నికలకు ముందే రాజకీయాలపై ఆసక్తి పోయిందని మాట్లాడటం, ప్రభుత్వం మారి ఏడాది గడిచినా ఎవరికీ అందుబాటులో లేకుండా, ఏం చేయాలనుకుంటున్నారో చెప్పకుండా ఉండటం క్యాడర్‌కు నచ్చడం లేదట.
ఆయన మౌనం ఇంకెన్నాళ్లో, అసలు ఆయన పార్టీలో ఉంటారో లేదో తెలియటం లేదట. అయితే ధర్మాన ప్రసాదరావు అంటే వయసులో పెద్దవారు. ఏజ్ సహకరించకపోవచ్చు. కనీసం ఆయన కుమారుడు రామ్‌మనోహర్ అయినా బయటకు రాకపోవడంతో..వాళ్ళు జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం ఊపందుకుందట. పైగా ఆ వార్తలను ఖండించకపోవడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తోందంటున్నాయి శ్రీకాకుళం వైసీపీ శ్రేణులు.
జనసేనలో చేరుతున్నారా?
ధర్మాన ప్రసాదరావు జనసేనలో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది. అంతకముందు టీడీపీలోకి వెళ్తారని ప్రచారం సాగింది. దానికి కారణం ఆయన వైసీపీతో అంటీముట్టనట్టుగా ఉండటమేనని అంటున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ సీటు టీడీపీకి అనుకూలంగా ఉంటూ వస్తోంది. టీడీపీ పుట్టాక 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అందులో ఏడు సార్లు టీడీపీయే శ్రీకాకుళం సీటును గెలుచుకుంది.
దాంతో పాటు అక్కడ కూటమి బలంగా ఉంది. ఈ క్రమంలో వైసీపీ బలహీనంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే ఆయన కుమారుడు ఫ్యూచర్ కోసం ధర్మాన ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ మారుతారన్న ప్రచారంపై కూడా ధర్మాన కలత చెందుతున్నారట. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీలోనే ఉంటానని సన్నిహితులతో చెబుతున్నారట.
అయితే ప్రజెంట్ పాలిటిక్స్‌లో కొనసాగడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు. నాలుగు దశాబ్దాలకు పైచిలుకు రాజకీయ జీవితం చూసిన ఆయన ఇక తాను రెస్ట్ తీసుకుందామని ఆలోచిస్తున్నారట. అయితే పార్టీ మారుతారన్న ప్రచారంపై పెద్దాయన నొచ్చుకున్నారని చెప్తున్నారు ఆయన అనుచరులు. సేమ్‌టైమ్ కుమారుడి పొలిటికల్ ఎంట్రీపైనే ఫోకస్ పెట్టారంటున్నారు. అయితే ధర్మాన తనయుడు వైసీపీలోనే ఉంటారా లేక తనకు నచ్చిన పార్టీని ఎంచుకుంటారా అన్నదే వేచి చూడాలి.