Thirumala : తిరుమలలో సంప్రదాయ భోజనం నిలిపివేత

తిరుమలలో సంప్రదాయ భోజనం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.

Thirumala : తిరుమలలో సంప్రదాయ భోజనం నిలిపివేత

Thirumala

Updated On : August 31, 2021 / 10:35 PM IST

traditional meal program : తిరుమలలో భక్తుల కోసం సంప్రదాయ భోజనం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తిరుమలలో ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ పాలకమండలి లేని సమయంలో అధికారులు మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశపెట్టారని వెల్లడించారు.

సంప్రదాయ భోజనం టీటీడీ అమ్మడం లేదని స్పష్టం చేశారు. ట్రయల్న్‌ విజయవంతం కాకపోవడంతో కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ భోజనంపై సోషల్‌మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. వాటిని భక్తులు నమ్మవద్దన్నారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఉచిత సర్వదర్శనాలపై అధికారులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

తిరుమలలో గోకులాష్టమి వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీవారి ఆలయంలో పుణ్యాహవచనం అనంతరం గోగర్భం తీర్థం వద్ద కాళీయమర్థనునికి పూజలు చేసి, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఉట్లోత్సవం కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.