అన్న క్యాంటీన్ల పేరుతో కోట్లు కొట్టేశారు- అంబటి రాంబాబు
అవి ప్రభుత్వ క్యాంటీన్ లా, లేక టీడీపీ క్యాంటీన్ లా..? గతంలో వైసీపీ రంగులు అంటూ నానా హడావిడి చేశారు. మరిప్పుడు చంద్రబాబు ఏం చెప్తారు..?

Ambati Rambabu : ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పేదలను ఆర్థికంగాపైకి తీసుకురావడం చంద్రబాబుకి ఇష్టం ఉండదని ఆయన అన్నారు. పేదలను ఆర్థికంగా పైకి తెచ్చేలా జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే, చంద్రబాబు ఏమో పేదలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. పేదలను ఆర్థికంగా పైకి తీసుకురాకుండా పూట అన్నం పెడతాం అని అన్న క్యాంటీన్ పెడుతున్నారని ధ్వజమెత్తారు.
పేదలకు భోజనం పెట్టాడానికి మేము వ్యతిరేకం కాదన్న అంబటి రాంబాబు.. అన్నం ఒక్కటే పెట్టి మిగతావి ఎగ్గొట్టడం సరికాదని హితవు పలికారు. గతంలోనూ ఇలానే అన్న క్యాంటీన్లు పెట్టి కోట్లు కొట్టేశారని ఆయన ఆరోపించారు. అన్న క్యాంటీన్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు సొంత డబ్బులతో పెట్టినట్టు అన్న క్యాంటీన్ భవనాలకు పసుపు రంగులు వేయడం దారుణం అన్నారు.
”అవి ప్రభుత్వ క్యాంటీన్ లా, లేక టీడీపీ క్యాంటీన్ లా..? గతంలో వైసీపీ రంగులు అంటూ నానా హడావిడి చేశారు. మరిప్పుడు చంద్రబాబు ఏం చెప్తారు..? ఓటమి ముందే గ్రహించి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు పోటీ పెట్టలేదు. మాకు 640 ఓట్లు ఉన్నాయి. మా ఓటర్లను మేము కాపాడుకున్నాం. మా వాళ్ళు ఐక్యమత్యంగా ఉన్నారు కనుకే చంద్రబాబు పోటీ పెట్టలేదు. టీడీపీ ప్రలోభాలకు గురి చేసినా మా ఓటర్లు లొంగలేదు. చంద్రబాబుకి అంత నైతికత ఉంటే లోకల్ బాడీల్లో ఫాలో అవ్వండి చూద్దాం” అని సవాల్ విసిరారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
”అన్న క్యాంటీన్లు ఎలా నడిచాయో, అన్న క్యాంటీన్లలో ఎంత అవినీతి జరిగిందో తెలిసిందే. గత చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. వాటిలో 114 అన్న క్యాంటీన్లను ఊరికి దూరంగా, ఎక్కడో మూలన, స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కట్టేశారు. నిజానికి జనాలు ఉన్న చోట్ల, మానవ సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు పెట్టాలి. కానీ, అలా జరగలేదు. ఎక్కడ పడితే అక్కడ అన్న క్యాంటీన్లు కట్టడం, ఆ కాంట్రాక్టర్ కు డబ్బులు ఇవ్వడం, అన్న క్యాంటీన్లలో ఫుడ్ వండటం, అందులో అవినీతి చేయడం. ఊరికి దూరంగా, మానవ సంచారం తక్కువగా ఉన్న చోట్ల అన్న క్యాంటీన్లు కట్టేశారు. దీనికి రూ.76 కోట్లు ఖర్చు చేశారు. నిజానికి అంత ఖర్చు అవ్వదు” అని అంబటి రాంబాబు అన్నారు.
Also Read : జగన్ మళ్లీ అధికారంలోకి రారు- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు