Roja : జగన్ లాంటి నాయకుడు ఏ రాష్ట్రంలో ఎవరికీ దొరకడు- రోజా
మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాటాలు సాగిస్తాం. ప్రజా సమస్యలపై పోరాడతాం.

RK Roja
Roja : నగరిలో వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజుల్లో వేడుకల్లో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. జగన్ పుట్టిన రోజు మా అందరికీ పండగ రోజు అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ఫ్లెక్సీలు కానీ కటౌట్ లు కానీ పెట్టకూడదంటున్నారు. పోలీసులను పెట్టి వాటిని చింపించడం, తప్పుడు కేసులు పెట్టించడం, బెదిరించడం వంటివి చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఇక మీదట ఇలాంటి నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదని, వడ్డీతో సహా తిరిగిస్తామని కూటమి ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రోజా.
”జగన్ లాంటి నాయకుడు ఏ రాష్ట్రంలో ఎవరికీ దొరకడు. అనునిత్యం పేదల కోసం ఆలోచిస్తాడు. కులం చూడడు, మతం చూడడు, పార్టీ చూడడు.. ప్రతీ ఒక్కరికి మంచి చేసిన వ్యక్తి. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో, ఈవీఎంలను మ్యానేజ్ చేసుకుంటూ అధికారంలోకి ఎలా వచ్చిందో మనం చూశాం. అందుకే, ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నా, ప్రజలు వాళ్లనెవరిని పట్టించుకోవడం లేదు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం లేదు, అభివృద్ధిని అందించడం లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు జగన్ కు మేము ఓట్లు వేశాం, అవి ఎక్కడికి వెళ్లాయని బాధపడుతున్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి, మా జీవితాలు బాగుపడాలని ప్రజలంతా స్వచ్చందంగా జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు.. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నాడు. కానీ, అధికారంలోకి వచ్చాక.. బాబు ష్యూరిటీ.. బాదుడే బాదుడు గ్యారెంటీ అన్నట్లుగా అయిపోయింది. చెప్పిన సూపర్ సిక్సులు ఏవీ చేయలేదు. కొత్తగా సూపర్ సిక్స్ లు తీసుకొచ్చారు. విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. ఫ్రీ ఇసుక అంటూ ధర రెండు రెట్లు పెంచారు. నిత్యవసర వస్తువుల ధరలు పెంచారు. ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ, బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఇవాళ తిరుపతి పవిత్రతను గంగ పాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు.
మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాటాలు సాగిస్తాం. ప్రజా సమస్యల తరపున పోరాడతాం. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ఫ్లెక్సీ పెట్టకూడదంట, కటౌట్ పెట్టకూడదంట, పోలీసులను పెట్టి వాటిని చింపించడం, తప్పుడు కేసులు పెట్టించడం, బెదిరించడం చూస్తుంటే..జగన్ ను చూస్తే భయం అనుకున్నాం. ఆయన కటౌట్ ను చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఇవాళ మాకు అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక మీదట ఇలాంటి చేతకాని పనులు, నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు. వడ్డీతో సహా చెల్లిస్తాం” అని వార్నింగ్ ఇచ్చారు రోజా.
Also Read : కూటమిలో పంపకాల లొల్లి తప్పదా? పదవి దక్కేదెవరికి?