Vijayawada: ఐస్ క్రీమ్‌లో సైనైడ్ కలిపి కొడుక్కి ఇచ్చిన తండ్రి.. ఆ తరువాత తానూ తాగేసి.. పోలీసుల విచారణలో ..

ఓ తండ్రి తన ఏడేళ్ల కొడుక్కి విషం ఇచ్చి చంపేశాడు. ఆ తరువాత అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Vijayawada: ఐస్ క్రీమ్‌లో సైనైడ్ కలిపి కొడుక్కి ఇచ్చిన తండ్రి.. ఆ తరువాత తానూ తాగేసి.. పోలీసుల విచారణలో ..

Penamalur Suicide case

Updated On : April 11, 2025 / 8:47 AM IST

Vijayawada: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఏడేళ్ల కొడుక్కి విషం ఇచ్చి చంపేశాడు. ఆ తరువాత అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమిరెడ్డి సాయిప్రకాశ్ రెడ్డి (33) యనమల కుదురులోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్డులోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య లక్ష్మీభవాని, కుమార్తె తక్షిత, కుమారుడు తక్షిత్(7) ఉన్నారు. సాయిప్రకాశ్ రెడ్డి విజయవాడలోని ఓ ప్రాంతంలో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం చేస్తుండేవాడు. అతని భార్య లక్ష్మీభవాని మందుల దుకాణంలో పని చేస్తుంది. సాయిప్రకాశ్ రెడ్డి వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో అప్పులు చేశాడు. కుటుంబ సభ్యులు కొంత అప్పులు తీర్చారు. అయినా సాయిప్రకాశ్ చేసిన అప్పులు ఎక్కువగా ఉండటంతో కొంతకాలంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాడు.

 

ఈనెల 9వ తేదీన సాయంత్రం భార్య లక్ష్మీభవాని మందుల దుకాణానికి వెళ్లగా.. సాయిప్రకాశ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం 6గంటల సమయంలో ఏడేళ్ల కుమారుడు తక్షిత్ కు ఐస్ క్రీమ్ లో సైనైడ్ కలిపి ఇచ్చి ఆ తరువాత అతనూ సైనైడ్ తాగేశాడు. వెంటనే వారిద్దరూ అస్వస్థతకు గురై ఇంట్లోనే పడిపోయారు. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి, కొడుకు ఇద్దరూ మరణించారు.

 

సాయి ప్రకాశ్ రెడ్డి తన సన్నిహితుడైన విజయ్ కు సెల్ ఫోన్ లో సారీ బావా నేను, తక్షిత్ సైనైడ్ తీసుకున్నాం.. అంటూ మెసేజ్ పెట్టడంతో సాయి ప్రకాశ్ రెడ్డి ఐస్ క్రీమ్ లో సైనైడ్ కలిపి తిన్నట్లు గుర్తించారు. భార్య లక్ష్మీభవాని ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.