పులివెందులకు మాజీ సీఎం వైఎస్ జగన్.. 3 రోజులు అక్కడే, ఏం చేస్తారంటే..

జూన్ 21న తాడేపల్లికి తిరిగి రానున్నారు జగన్. 22న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు.

పులివెందులకు మాజీ సీఎం వైఎస్ జగన్.. 3 రోజులు అక్కడే, ఏం చేస్తారంటే..

YS Jagan Pulivendula Tour : మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు(జూన్ 19) పులివెందులలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు జగన్. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. జూన్ 21న తాడేపల్లికి తిరిగి రానున్నారు జగన్. 22న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు.

పులివెందుల నియోజకవర్గంలో 3 రోజుల పాటు ఉండనున్న జగన్.. వరుసగా పార్టీ నేతలు, కార్యకర్తలతో వరుసగా సమావేశం కానున్నారు. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి మండలాల వారీగా నేతలతో కూడా జగన్ సమావేశం కాబోతున్నారు. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమిపాలైన తర్వాత వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలోని కార్యకర్తలు, నేతలతో సమావేశమై వారిలో భరోసా నింపనున్నారు జగన్. 4 మండలాలకు సంబంధించిన నేతలు, కార్యకర్తలతో కలిసి సమీక్ష చేయబోతున్నారు జగన్. భవిష్యత్ కార్యాచరణ, ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్లాలి అనేదానికి సంబంధించి చర్చించబోతున్నారు. ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. 21వ తేదీన జగన్ తిరిగి తాడేపల్లికి తిరిగి వస్తారు. 22వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.

ముందుగా 19వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో 22న విస్తృతస్థాయి సమావేశం ఉండబోతోంది. పార్టీ తరుపున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే ఆహ్వానం పంపారు. విస్తృతస్థాయి సమావేశం చాలా కీలకంగా ఉండబోతోంది.

Also Read : ఎవర్నీ వదలం.. ఆరోగ్యశ్రీ పథకంపై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వైఎస్ జగన్ ఒక ప్రకటన చేస్తారని పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ. పోలవరం, రిషికొండ, తాడేపల్లి నివాసానికి సంబంధించి వస్తున్న ఆరోపణలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని, భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ పులివెందుల పర్యటన ఆసక్తికరంగా మారింది.