AP Congress Party : ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా.. త్వరలో షర్మిల చేతికి పార్టీ పగ్గాలు?
ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు.

Gidugu Rudra Raju
YS Sharmila : ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు రుద్రరాజు రాజీనామా చేసినట్లు తెలిసింది. త్వరలో ఏపీసీసీ పగ్గాలు వైఎస్ షర్మిలకు అప్పగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు మణిపూర్ లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో.. ఒకటి రెండు రోజుల్లో ఏపీ పీసీసీగా షర్మిల నియామకంపై హైకమాండ్ ప్రకటన చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
వైఎస్ షర్మిల ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాక, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేకముందే.. రాహుల్, సోనియాలతో పలుసార్లు భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ లో చేరితే జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల సేవలు ఎంతో కీలకమని భావించిన రాహుల్ గాంధీ.. ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారని సమాచారం. అందుకు ఏపీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలుసైతం అనుకూలంగా ఏకాభిప్రాయాన్ని తెలియజేశారు.
Also Read : Ram Mandir Inauguration : అయోధ్యలో భారీగా పెరిగిన హోటల్ రూం ధరలు.. అక్కడ ఒక్కో రూం ధర 85వేలుపైమాటే
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరును రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. ఎల్లుండి వియవాడలో స్క్రీనింగ్ కమిటీ జరగనుంది. ఈ సమావేశానికి షర్మిల హాజరయ్యే అవకాశం ఉంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, పార్టీలో చేరికల బాధ్యతలను షర్మిలకు హైకమాండ్ అప్పగిస్తుందని ఏపీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. షర్మిల ఆదివారం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.
మరికొద్ది నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీతోపాటు జనసేన, బీజేపీలు ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు షర్మిల చేపడితే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి నియోకవర్గాల వారిగా ఇంచార్జిలను మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో టికెట్ దక్కదని భావించిన వైసీపీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీలోకి, మరికొందరు జనసేనలో చేరారు. షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత వైసీపీలోని అసంతృప్త నేతలను ఏమేరకు కాంగ్రెస్ వైపు ఆకర్షించగలుగుతారనే విషయం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.