చంద్రబాబు, లోకేశ్ నన్ను అవమానకరంగా మాట్లాడారు.. రాపాకతో కలిసి పనిచేస్తా: గొల్లపల్లి సూర్యారావు

లోకేశ్, చంద్రబాబు నన్ను అవమానకరంగా మాట్లాడారు. టీడీపీలో దళితులకు గౌరవం లేదు. నాలాంటి దళిత నేతల బతుకులను చిందర వందర చేస్తున్నారంటూ గొల్లపల్లి సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు, లోకేశ్ నన్ను అవమానకరంగా మాట్లాడారు.. రాపాకతో కలిసి పనిచేస్తా: గొల్లపల్లి సూర్యారావు

Gollapalli Surya Rao

Gollapalli Surya Rao : మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 43 ఏళ్లుగా రాజకీయాల్లో విలువలతో పని చేశానని, చిన్న తప్పు గానీ, పొరపాటు గానీ చేయలేదని అన్నారు. అలాంటి నన్ను మెడపై చెయ్యివేసి బయటకు గెంటేశారు. టీడీపీలో భరించలేని అవమానకరమైన పరిస్థితులు అనుభవించాను. చంద్రబాబు నా విషయంలో ఘోరమైన తప్పులు చేశారని గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

Also Read : Gollapalli Surya Rao: టీడీపీకి బిగ్‌షాక్‌.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి

2014లో అమలాపురం ఎంపీ అభ్యర్థి అని ప్రకటించి చివర్లో మార్చేశారు. అనుకోకుండా రాజోలుకు పంపారు. నాకున్న క్లీన్ ఇమేజ్ తో గెలిచాను. నాకు అన్యాయం చేసినా ఐదేళ్లు విశ్వాసంగా పనిచేశాను. 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయా. గత ఐదేళ్లు క్రమశిక్షణతో పనిచేశానని సూర్యారావు అన్నారు. దళిత నేతల్లో నేనే సీనియర్ నేతను. మొదటి లిస్టులో నా పేరు లేదు. కోనసీమలో ఉన్న మూడు రిజర్వుడ్ సీట్లలో రెండు జనసేనకు ఇచ్చారు. ఒకటి టీడీపీకి ఇచ్చారు. టీడీపీకి ఇచ్చిన సీటులో నాకు స్థానం ఉంటుందని అనుకున్నా. ఇవ్వకుండా ఎవరినో తెచ్చారు. పోతేపోనీ అని అవమానకరంగా మాట్లాడారంటూ గొల్లపల్లి సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం జమ చేసిన సీఎం జగన్

లోకేశ్, చంద్రబాబు నన్ను అవమానకరంగా మాట్లాడారు. టీడీపీలో దళితులకు గౌరవం లేదు. నాలాంటి దళిత నేతల బతుకులను చిందర వందర చేస్తున్నారు. జగన్ నన్ను హక్కున చేర్చుకుని పార్టీలోకి ఆహ్వానించారని సూర్యారావు చెప్పారు. అనేక సవాళ్లు ఎదుర్కొని నిలబడిన వ్యక్తి జగన్. రాబోయే రోజుల్లో జగన్ ఏం చెబితే అది చేస్తా.. రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చెయ్యమన్నా చేస్తా.. ఏదైనా స్థానం ఇచ్చి పోటీ చెయ్యమన్నా చేస్తానని గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో కలిసి పనిచేస్తానని, చెయ్యాల్సిన అవసరం ఉందని సూర్యారావు అన్నారు. నాకు ఎలాంటి భేషజాలు లేవు. అందరితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. రాపాకతో నాకు ఎలాంటి విబేధాలు లేవుని చెప్పారు. గత ఐదేళ్లు రాజోలుకు ఆయన మంచి సేవ చేశారు. మా పార్లమెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తానని గొల్లపల్లి సూర్యారావు చెప్పారు.