గుడ్ న్యూస్ : ఏపీలో కరోనా లేదు!

  • Published By: madhu ,Published On : March 5, 2020 / 12:42 AM IST
గుడ్ న్యూస్ : ఏపీలో కరోనా లేదు!

Updated On : March 5, 2020 / 12:42 AM IST

ఏపీలో సేకరించిన 11 మంది కరోనా అనుమానితుల నమూనాలను పరీక్షించగా అందరికీ నెగటివ్‌ వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కరోనా అప్రమత్తపై వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నామని తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన 8 మంది నమూనాలను పుణె పంపామని పేర్కొంది.

సింగపూర్‌, బహ్రెయిన్‌ నుంచి వచ్చిన ఐదుగురికి విశాఖ ఛాతి ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో, దక్షిణ కొరియా నుంచి వచ్చిన వ్యక్తికి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. జర్మనీ ప్రయాణికుడికి విజయవాడ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో.. మస్కట్‌ నుంచి వ్యక్తికి ఏలూరులోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో మందులు, రక్షణ కిట్లు, ఎన్‌ మాస్కులు నిల్వ ఉంచినట్లు బులెటిన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రజల సహాయం కోసం 24 గంటల కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని వెల్లడించింది.

గుంటూరు, విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రులో కరోనా అనుమానితుల కోసం.. ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డుల్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఎలాంటి కేసులొచ్చినా వారికి వైద్య సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గన్నవరం విమానాశ్రయానికి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేశాకే బయటకు పంపిస్తామన్నారు.

మరోవైపు కరోనా అనుమానిత కేసులు నమోదు కావడంతో సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో మల్టీ సెక్టోరల్‌ కో ఆర్డినేషన్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అదనపు సీఎస్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా అనుమానితులకు మెరుగైన వైద్యం అందివ్వాలని నిర్ణయించారు.

Read More : తెలంగాణకు కరోనా భయం : ఐటీ ఉద్యోగి హెల్త్ రిపోర్టుపై ఉత్కంఠ