Tirumala Silk Shawl Scam: మొన్న నెయ్యి.. నిన్న చోరీ.. ఇప్పుడు.. తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో బిగ్ స్కామ్?
తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస సంఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నాయి. కొనుగోలు వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు జరిగితే.. ఎవరు బుక్కవుతారో చూడాలి.
Tirumala Silk Shawl Scam: కల్తీ నెయ్యి మరకల కథేంటో తేలనే లేదు. పరకామణి చోరీ పాపం ఎవరిదో సస్పెన్స్‌గానే ఉంది. అంతలోనే శ్రీవారి కొండపై మరో స్కామ్ కలకలం రేపుతోంది. ఏకంగా వెంకన్న సన్నిధిలో వాడే పట్టు శాలువాల కొనుగోలులోనే బిగ్ స్కామ్ జరిగిందని టీటీడీ గుర్తించడం సంచలనంగా మారింది. మల్బరీ వస్త్రాలకు బదులు..పాలిస్టర్ శాలువాలను సప్లై చేశారని టీటీడీ అంటోంది. ఎక్కువ రేటుకు నాసిరకం వస్త్రాలు కొనుగోలు వెనక జరిగిందేంటి? టీటీడీ ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించడంతో ఏం జరగబోతోంది?
వడ్డీకాసుల వాడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో..మరో స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ ఎపిసోడ్ కొండంత వివాదంగా కొనసాగుతుంటే..ఇప్పుడు టీటీడీ నిధుల స్వాహా అంటూ కొత్త అలిగేషన్స్ తెరమీదకు రావడం కలవరం రేపుతోంది. ఈ క్రమంలో తిరుమలలో మరో కుంభకోణం బయటపడింది. ఓ కంపెనీ మల్బరీ పట్టు శాలువాలకు బుదులు..100 శాతం పాలిస్టర్ శాలువాలను పంపిణీ చేసిందని టీటీడీ ఆరోపిస్తుంది. వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ నగరి అనే సంస్థ..కొన్నేళ్లుగా నాసిరకం శాలువాలను సరఫరా చేసిందని టీటీడీ చెబుతోంది. రూ.350-400 విలువ చేసే శాలువాలను..ఏకంగా రూ.1,389కు అప్పట్లో కొనుగోలు చేశారని అంటోంది టీటీడీ. శాలువాల ఆర్డర్ ఇచ్చిందెవరు? పాలిస్టర్ శాలువాల కొనుగోలు పాపం ఎవరిది? శాలువాలు సప్లై చేసే కంపెనీలతో కుమ్మక్కైందెవరనే దానిపై నిజానిజాలు తేల్చేందుకు ఏసీబీ విచారణకు ఆదేశించింది టీటీడీ.
తిరుమల శ్రీవారికి విరాళాలు సమర్పించే భక్తులు, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కొనుగోలు చేసిన వారికి..వీవీఐపీలకు..రంగనాయకుల కళ్యాణ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇస్తారు. ఈ సమయంలో టీటీడీ పండితులు, అర్చకులు పట్టు శాలువాలతో వారిని సత్కరిస్తుంటారు. దీనికోసం టీటీడీ ఎప్పటికప్పుడు కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే పట్టు శాలువాలను కొనుగోలు చేస్తుంది. అయితే ఈ పట్టు శాలువాలు టెండర్ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన ప్రమాణాలకు తగ్గట్లుగా ఉన్నాయా లేవా అని ఆరా తీశారట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించడంతో ఈ పట్టు శాలువాల స్కామ్ బయటపడిందని అంటున్నారు.
గోదామ్‌లోకి కొత్తగా వచ్చిన స్టాక్, లేటెస్ట్‌గా శాలువాల కొనుగోలుకు ఇచ్చిన స్టాక్ నమూనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిశీలించారట. వాటిని బెంగళూరు, ధర్మవరంలో ఉన్న సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబొరేటరీస్‌కు పంపించి టెస్ట్ చేయిస్తే..శాలువాలు పాలిస్టర్ మెటీరియల్‌తో తయారు చేసినట్లు తేలిందని చెబుతోంది టీటీడీ. శాలువాలపై పట్టు హోలోగ్రామ్ గత కొన్నేళ్లుగా లేదని అంటోంది. అయితే తిరుమల శ్రీవారి ఆలయ అవసరాల కోసం పట్టు శాలువాలను సప్లై చేసే టెండర్..వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్ ఆఫ్ నగరి అనే సంస్థ దక్కించుకుంది. గొత కొన్నేళ్లుగా ఈ సంస్థనే టీటీడీకి పట్టు శాలువాలను సరఫరా చేస్తోంది.
54 కోట్ల రూపాయల స్కామ్..?
టెండర్ లెక్కల ప్రకారం..శాలువాలను వార్ప్, వెఫ్ట్..అంటే అడ్డం, పొడుగు దారం నూలు..రెండింటిలోనూ..20/22 డెనియర్ క్వాలిటీ నూలును ఉపయోగించి పూర్తిగా స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నేయాలి. కనీసం 31.5 డెనియర్ నూలు వాడాలని కండీషన్ పెట్టారట. ప్రతి శాలువాపై ఒకవైపు సంస్కృతంలో, మరోవైపు తెలుగులో ఓం నమో వేంకటేశాయ అని.. శంకు చక్రం, నామం చిహ్నాలు ఉండాలి. ఇక శాలువా పరిమాణం, బరువు, బార్డర్ డిజైన్‌ను కూడా టెండర్ నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారట. ఈ ప్రమాణాలకు బదులు నాసిరకం, పూర్తి పాలిస్టర్‌తో శాలువాలు తయారు చేసి..టీటీడీని మోసం చేశారని బీఆర్ నాయుడు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏసీబీ దర్యాప్తునకు టీటీడీ తీర్మానం చేసింది. వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్ ఆఫ్ నగరి, దాని అనుబంధ సంస్థ..21 వేల శాలువాలను సప్లై చేసిందని..ఈ వ్యవహారంలో దాదాపు రూ. 54 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు అనుమానిస్తోందట టీటీడీ.
ఈ మధ్యకాలంలో టీటీడీలో ఇలాంటి ఘటనలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. లేటెస్ట్ స్కామ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నామన్న పవన్..నకిలీ పట్టువస్త్రాల వ్యవహారం టీటీడీలో మూడో స్కామ్‌గా చెప్పుకొచ్చారు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ నిందితులను చట్టమే కాదు దేవుడు కూడా శిక్షిస్తారని అన్నారు పవన్ కల్యాణ్. హిందువులు, వారి మనోభావాలను దెబ్బతీసేలా ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సహించేది లేదన్నారు. అయితే వరల్డ్ వైడ్‌గా ఎంతో పేరు ప్రతిష్టలు..అన్నింటికి మించి కోట్లాది మంది భక్తుల విశ్వాసంగా ఉన్న తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస సంఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టు శాలువాల కొనుగోలు వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు జరిగితే..ఎవరు బుక్కవుతారో చూడాలి.
Also Read: సై అంటే సై.. కుర్చీ కోసం మామ, కోడలు ఫైట్.. పంతం నెగ్గించుకునేదెవరు?
