Cm Chandrababu: టెన్షన్ ఎక్కువైతే మెడిటేషన్ చేయండి.. ఆ ఎమ్మెల్యేపై చంద్రబాబు ఎందుకంత సీరియస్ అయ్యారు?
ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్షం నుంచే కాకుండా సోషల్ మీడియాలోనూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీలోనూ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సరికాదన్న చర్చ నడుస్తోందట
- ఎమ్మెల్యే అరవింద్ బాబు లిఖిత పూర్వక వివరణ కోరిన టీడీపీ అధ్యక్షుడు
- ఎస్పీ ఆఫీస్‌లో రచ్చ చేసి చర్చకు దారితీసిన ఎమ్మెల్యే
- లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో రచ్చరంబోలా..
Cm Chandrababu: ఆ ఎమ్మెల్యే ఏదో చేయాలనుకున్నారు. ఇంకేదో అయింది. పంతం కోసం పోయి పార్టీకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఆయన ప్రొటెస్ట్ కాస్త రచ్చ అయి చర్చకు దారితీయడంతో సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. టీడీపీ అధిష్టానం ఎక్స్ప్లనేషన్ కోరింది. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఆయన తీరు ఎందుకు వివాదాస్పదం అయింది?
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు తీరు చర్చనీయాంశంగా మారింది. చిన్న పోస్ట్ కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి..ఏకంగా ఎస్పీ ఆఫీస్‌లో రోజంతా రచ్చ చేసి వార్తల్లో నిలిచారు. ఇష్యూ కాస్త వివాదాస్పదం కావడంతో ఎమ్మెల్యే తీరుపై టీడీపీ పెద్దలు రియాక్ట్ కాక తప్పలేదు. మా ఎమ్మెల్యే వేరే ఆఫీసు మీద పడ్డారంటూ చదలవాడ వ్యవహారంపై రియాక్టయ్యారు సీఎం. ఎమ్మెల్యేలు అయినా, ప్రజలు అయినా.. టెన్షన్ తగ్గించుకోవాలని, మరీ టెన్షన్ ఎక్కువైతే మెడిటేషన్ చేయాలని సూచించారు. అవసరమైతే యోగా తరగతులు ఏర్పాటు చేస్తామంటూ..అరవింద్ ఎపిసోడ్‌కు అలా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు.
పల్నాడు జిల్లా పోలీస్ లీగల్ అడ్వైజర్‌గా తాను చెప్పిన వ్యక్తి పేరును ఆమోదించలేదంటూ..ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మంగళవారం నాడు పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో హడావిడి చేశారు. ఏకంగా పది గంటల పాటు ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్డర్ కాపీ ఇచ్చేవరకూ బయటకు రానంటూ ఎస్పీతో వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో పల్నాడు జిల్లా ఎస్పీ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కార్యాలయానికి తిరిగి వచ్చి, సిఫారసు లేఖపై సంతకం చేసిన ఎస్పీ.. ఆ లేఖను డీజీ కార్యాలయానికి పంపించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పట్టువీడలేదు.
బాత్రూమ్ లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్న ఎమ్మెల్యే..
నియామక ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ కదిలేది లేదంటూ.. బాత్రూమ్ లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అక్కడకు చేరుకుని సర్దిచెప్పినా వినలేదు. మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత ఆఫీస్‌ల నుంచి ఫోన్లు వచ్చినా స్పందించలేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బాత్రూమ్ తలుపులను డంబెల్స్‌తో పగలగొట్టిన పోలీసులు..ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబును బయటకు తీసుకొచ్చారు. ఒకరోజులోపు లీగల్ అడ్వైజర్ నియామక పత్రాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌కు అందిస్తానని.. ఐజీ హామీ ఇవ్వటంతో మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర దాటాక అరవింద బాబు ఎస్పీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తీరు చర్చకు దారితీస్తోంది. అటు విపక్షాల నుంచి విమర్శల రావడమే కాదు..కూటమి పార్టీల్లోనూ చదలవాడ వ్యవహారంపై అసహనం వ్యక్తం అయింది.
పల్నాడు ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహరించిన తీరుపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అరవిందబాబును ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. అయితే ఎస్పీ ఆఫీస్‌లో నిరసన తెలుపుతున్నప్పుడు ఎమ్మెల్యే అరవిందబాబుకు ఫోన్ చేసినా స్పందించకపోవడంపై పల్లా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారట. న్యాయ సలహాదారు పోస్ట్‌కు సిఫార్స్ చేస్తే..అధికారులు ఆమోదించకుంటే..హైకమాండ్ దృష్టికి తీసుకురాకుండా..రచ్చ చేయడం ఏంటంటూ ఎమ్మెల్యే తీరుపై హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
మరోవైపు నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబును రెండు, మూడు రోజుల్లో అమరావతికి పిలిచి మాట్లాడాలని సీఎం చంద్రబాబు..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే అరవింద్ బాబు తీరుపై ప్రతిపక్షం నుంచే కాకుండా సోషల్ మీడియాలోనూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీలోనూ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సరికాదన్న చర్చ నడుస్తోందట. ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా ఎస్పీ ఆఫీస్‌లో ప్రొటెస్ట్ చేయడమేంటని గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఏదైనా ఇష్యూ ఉంటే సంబంధిత మంత్రికి లేకపోతే నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్తే అయిపోయే దానికి..అనవసరంగా రచ్చ చేసి..పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.
Also Read: తిరుపతిలో మతమార్పిడి.. భూమన చొరవతో హిందూ మతంలోకి ముస్లిం దంపతులు
