Father Vs Daughter: తండ్రి, కూతురు మధ్య పొలిటికల్ ఫైట్.. గోదావరి తీరంలో ఇంట్రెస్టింగ్‌ రాజకీయం.. ఏపీ పాలిటిక్స్ లో ఇదే తొలిసారి..!

వాస్తవానికి వైసీపీ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు ముందు టీడీపీలోనే ఉండే వారు. 1985లో అల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.

Father Vs Daughter: తండ్రి, కూతురు మధ్య పొలిటికల్ ఫైట్.. గోదావరి తీరంలో ఇంట్రెస్టింగ్‌ రాజకీయం.. ఏపీ పాలిటిక్స్ లో ఇదే తొలిసారి..!

Updated On : October 21, 2025 / 8:23 PM IST

Father Vs Daughter: ఒకే కుటుంబంలో రెండు పార్టీల జెండాలు. ప్రెజెంట్ పాలిటిక్స్‌లో ఇదంతా కామన్ అయిపోయింది. అన్నా, తమ్ముడు, మామ, అల్లుడు పొలిటికల్ రేసులో ఉంటుండటం చూస్తూనే ఉన్నామ్. కానీ గోదావరి తీరంలో ఇంట్రెస్టింగ్‌ రాజకీయం నడుస్తోంది. తండ్రీ, కూతుర్ల మధ్య పొలిటికల్ యుద్ధభేరి హీటెక్కుతోంది. అధికార పార్టీలో కూతురు. ప్రతిపక్ష పార్టీలో తండ్రి. ఏ వర్గం ఎవరికి మద్దతు ఇస్తుంది? ఇంతకు ఏ నియోజకవర్గంలో డాడీ వర్సెస్ డాటర్ పాలిటిక్స్‌ నడుస్తున్నాయ్?

తండ్రికి పోటీగా కూతురిని దింపిన టీడీపీ..

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో తండ్రీ కూతురు మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఈ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా ఈ మధ్యే గొల్లపల్లి అమూల్య ఎంపికయ్యారు. ఈమె తండ్రి మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రస్తుతం వైసీపీలో ఉండగా, గత ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు రాజోలు వైసీపీ ఇంచార్జ్‌గా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈయనకు పోటీగా అధికార పార్టీ సొంత కూతురికే బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది.

టీడీపీ అధిష్టానం నిర్ణయంతో రాజోలు నియోజకవర్గంలో తండ్రి, కూతుళ్ల మధ్య రాజకీయ సమరం నడుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి జనసేన నేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి నుంచి టీడీపీలో ఉన్న అమూల్య ఎమ్మెల్యేతో కలిసి చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నారు. గత 16 నెలలుగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా ఉన్నారు. దీంతో ఐవీఆర్ఎస్ సర్వేలో ఆమెకు ఇంచార్జ్ పదవి ఇవ్వాలని 70 శాతం మంది కోరడంతో సీఎం చంద్రబాబు రాజోలు టీడీపీ పగ్గాలు అమూల్యకు అప్పగించారు.

తొలిసారి తండ్రీ కూతురి మధ్య పొలిటికల్ ఫైట్..

టీడీపీ వాడిన అస్త్రంతో తండ్రిని ఢీకొట్టేందుకు అమూల్య రెడీ అయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు అన్నాదమ్ములు, అన్నాచెల్లెళ్లు మధ్య రాజకీయ పోరాటం జరిగింది. మాజీ సీఎం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల, విజయవాడ ఎంపీ కేశినేని బ్రదర్స్ మధ్య పొలిటికల్ ఫైట్ చూస్తూనే ఉన్నామ్. కానీ తండ్రి కూతురు మధ్య పోటీ మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది. తొలిసారిగా రాజోలులో గొల్లపల్లి సూర్యారావు వర్సెస్ అమూల్య మధ్య జరగనున్న రాజకీయ యుద్ధం కొత్త చరిత్రకు నాంది పలికినట్లే అంటున్నారు.

వాస్తవానికి వైసీపీ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు ముందు టీడీపీలోనే ఉండే వారు. 1985లో అల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో వైఎస్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. 2014లో మళ్లీ టీడీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావు రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో జనసేన పోటీలో నిలవడంతో ఓట్లు చీలి ఆయన ఓటమి పాలయ్యారు.

ఇక గత ఎన్నికల ముందు వరకు టీడీపీలోనే కొనసాగిన గొల్లపల్లి.. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలను జనసేనకు కేటాయించడంతో ఆయనకు చాన్స్ దక్కలేదు. దీంతో చివరి నిమిషంలో వైసీపీలోకి వెళ్లి రాజోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటికీ ఆ పార్టీ తరఫున యాక్టివిటీ నడిపిస్తున్నారు. అయితే తండ్రి వైసీపీలోకి వెళ్లడాన్ని ఇష్టపడని అమూల్య మాత్రం టీడీపీలోనే కొనసాగారు.

అమూల్యనే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని టీడీపీ ప్లాన్..!

నిజానికి రాజోలును జనసేనకు కేటాయించకపోతే అమూల్యనే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని టీడీపీ భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, ఆయన కుమారుడు కూడా అమూల్యపై కినుక వహించినట్లు ప్రచారం ఉంది. కార్యకర్తలతో మమేకమవడంతో పాటు రాజకీయ వ్యూహాలు రచించడంలో కాస్త ముందుండటం అమూల్యకు ప్లస్ అయ్యాయంటున్నారు. అందుకే నియోజకవర్గంలో 70 శాతం మంది ఆమె నాయకత్వానికి జైకొట్టారని అంటున్నారు. ఇలా రాజోలు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అయిన అమూల్య..రాబోయే తన తండ్రి వైసీపీ నేత గొల్లపల్లి సూర్యారావును ఢీకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. డాడీ, డాటర్ ఫైట్‌లో భాగంగా ఫ్యూచర్‌లో రాజోలు పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.