Gossip Garage : ఇక ఆగేదేలే.. పాలిటిక్స్‌లో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్న జనసేన..

రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు

Gossip Garage : ఇక ఆగేదేలే.. పాలిటిక్స్‌లో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్న జనసేన..

Updated On : January 23, 2025 / 12:28 AM IST

Gossip Garage : పదేళ్ల కింద చుట్టూ చీకట్లు. ఎటుచూసినా దారి కనిపించని పరిస్థితి. అయినా సింగిల్‌గా బయలుదేరాడు. తానే ఆయుధంగా..నినాదంగా..ఒక్కడై నిలబడి..ఒంటరిగా పోరాడి..కూటమిగా జతకట్టి జనం మెచ్చిన జనసేనాని అయ్యాడు పవన్‌ కల్యాణ్. పార్టీ పెట్టిన దశాబ్దం తర్వాత..రాజకీయ ప్రభంజనం సృష్టించి..టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారిన పవర్‌ స్టార్‌..ఇప్పుడు తన పార్టీకి కూడా తగిన గుర్తింపు తీసుకొచ్చాడు. పదేళ్ల కాలంలో పట్టు వదలకుండా పవన్ పనిచేసిన తీరుతో, వ్యూహాలతో జనసేన మూడో పార్టీగా ఏపీ పాలిటిక్స్‌లో ఎమర్జ్ కాగలిగింది.

2014లో జనసేన పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినా అధినేత పవన్ రెండు సీట్లలో ఓటమి పాలయ్యారు. ఆ పార్టీకి ఒకే సీటు దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అప్పుడు ఏడు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో 2019లో ఎన్నికల్లో జనసేనకు తాత్కాలికంగా గాజు గ్లాస్ సింబల్‌ దక్కడం కూడా కష్టమైంది. 2024లోనూ అతికష్టం మీద జనసేనకు గ్లాస్‌ గుర్తును కేటాయించినా..దానిని ఫ్రీ సింబల్‌ లిస్ట్‌లో పెట్టింది ఈసీ. అయితే 2024 ఎన్నికల్లో కూటమి బంపర్‌ విక్టరీలో కీ రోల్ ప్లే చేసిన పవన్..తన పార్టీ పోటీ చేసిన 21కి 21 సీట్లు గెలుచుకున్నారు.

అంతేకాదు ఏకంగా 8 శాతం ఓటు షేర్‌ను సాధించింది జనసేన. దాంతో జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ వినిపించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా కేటాయిస్తూ ఏపీలో జనసేనను గుర్తింపు పొందిన పార్టీగా గుర్తిస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది. దీంతో జనసేన కూడా ఏపీలో టీడీపీ వైసీపీలతో సరి సమానంగా రాజకీయం చేసేందుకు..జనానికి తెలిసిన గాజు గ్లాస్‌ గుర్తుతో దూకుడు పెంచేందుకు ఈసీ నిర్ణయం ఉపయోగపడనుంది.

Also Read : జీవీఎల్‌ నరసింహారావు హడావుడి ఎందుకు తగ్గినట్లు?

ఇక ఇప్పటికే జనసేన ఆవిర్భావ సభలు షెడ్యూల్‌ ఫిక్స్ అయ్యాయి. మార్చి 14న పిఠాపురం వేదికగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయి. ఈ సభలలో పదేళ్ళ పార్టీ రాజకీయ ప్రస్థానం ముగించుకుని 11వ ఏట అడుగుపెడుతున్న వేళ సాధించిన విజయాలు.. భవిష్యత్‌ లక్ష్యాలపై డిస్కస్ చేయనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జనసేన పార్టీ ప్లీనరీ జరగబోతుండటంతో ఇప్పటికే జోష్‌ మీదున్నారు లీడర్లు, క్యాడర్.
వాళ్ల ఉత్సాహానికి ఇప్పుడు మరో కొత్త హుషార్ తోడైంది.

అదే శాశ్వతంగా గాజు గ్లాస్‌ సింబల్. ఇది ఆ పార్టీ సాధించిన మరో విజయంగా భావిస్తున్నారు. జనసేన గుర్తు గాజు గ్లాస్‌గా జనాలకు పరిచయమైపోయింది. ఇంతకాలం అది ఫ్రీ సింబల్ కావడం వల్ల జనసేనకు ఇబ్బంది ఏర్పడింది. ఇక మీదట జనసేన సొంత గుర్తుతో పోటీకి దిగొచ్చు. ఏ రాజకీయ పార్టీకి అయినా ఊపిరి ప్రాణమూ గుర్తు మాత్రమే. అటువంటి గుర్తును సాధించిన జనసేన ఇక ఫుల్‌ జోష్‌, దూకుడుతో ప్లీనరీ సభలకు ముస్తాబు కాబోతోంది.

ఇక ఈసారి పార్టీ అధ్యక్షుడిగానే కాదు..ఏపీ డిప్యూటీ సీఎంగా ప్లీనరీకి అటెండ్ కానున్నారు పవన్‌ కల్యాణ్. ఇది కూడా పవన్‌ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు మరింత జోష్ కలిగించే అంశం. అంతేకాదు ఆ పార్టీ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు మంత్రులు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అప్పటివరకు నాగబాబు కూడా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన కూడా మినిస్టర్‌ హోదాలో జనసేన ఆవిర్భావ వేడుకలకు అటెండ్ కానున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేక అంశాల మధ్య గ్లాస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.

ఇక డిప్యూటీ సీఎంగా పవన్‌కు ఈ ఆరు నెలలు కావాల్సినంత మైలేజ్ వచ్చింది. ఏ రాష్ట్రంలో ఏ నేతకు, ఉప ముఖ్యమంత్రికి రానంత గుర్తింపు, ఎలివేషన్‌ పవన్‌కు దక్కాయి. గత పదేళ్లలో టీడీపీ హయాంలో, వైసీపీ ప్రభుత్వంలో..ఇటు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో దాదాపు పది మంది డిప్యూటీ సీఎంలుగా పని చేశారు. ఎవరికి డిప్యూటీ సీఎం పదవి దక్కినా వారంతా మంత్రులుగానే చలామణి అయ్యారు. ఒక పవన్‌ మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి..పవర్ సెంటర్‌గా కనిపిస్తున్నారు. అలా ఏపీలో డిప్యూటీ సీఎం పోస్ట్‌కు పొలిటికల్ గ్లామర్ తెచ్చారు పవన్ కల్యాణ్.

అపరిమితమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పవన్‌ సొంతం. జనసేనానిగా కూడా బలమైన సామాజిక వర్గం వెన్నుదన్ను ఉంది. అంతేకాదు ఆయన పార్టీకి కొన్ని సెక్షన్లలో మంచి మద్దతు ఉంది. దీంతో పవన్‌ను బలమైన నేతగా..పవర్‌ఫుల్‌ డిప్యూటీ సీఎంగా భావిస్తున్నారు జనం. కాబోయే సీఎంగా జనసేన అభిమానులు ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు. పవన్ ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యే అయ్యారు. కీలక శాఖలు చూస్తున్నారు. దాంతో తనను తాను రుజువు చేసుకోవాలన్న ఆయన తాపత్రయం కూడా డిప్యూటీ సీఎం పోస్ట్‌కు వన్నె తెలస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

ఇక తిరుమల లడ్డూ ఇష్యూ, కాకినాడ పోర్ట్‌లో బియ్యం దందా, కడపలో ఎంపీడీవోపై అటాక్‌ మీద స్పందించి..ఫ్యూచర్‌ లీడర్‌గా మరింత ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నారు పవన్. ఆయన చేసే సంచలన ప్రకటనలు.. పర్యటనలు..ఆయన ఇచ్చే పదునైన స్టేట్‌మెంట్లు, సేనాని దూకుడు రాజకీయం..ఉప ముఖ్యమంత్రి మరీ ఇంత పవర్ ఫులా అని అనిపించేట్లుగా చేస్తున్నాయి.

అంతే కాదు పవన్ ఏపీ కూటమిలో జనసేన పార్టీతో మిత్రుడిగా ఉన్నారు. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ దృష్టిలో పెట్టుకుని సేనాని సేవలను మహారాష్ట్రలో ఉపయోగించుకుంది బీజేపీ. రాబోయే తమిళనాడు ఎన్నికల్లోనూ పవన్‌తో ప్రచారం చేయించే అవకాశం ఉంది. ఇలా డిప్యూటీ సీఎం పోస్ట్‌కు అడిషనల్‌ వ్యాల్యూ తెస్తున్నారు పవన్. అటు పార్టీకి గాజు గ్లాస్ సింబల్, డిప్యూటీ సీఎంగా పవన్‌ దూకుడు.. అన్నీ జనసేనకు ఫెచ్చింగ్‌ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. పవన్‌ పొలిటికల్ అడుగులు ఎటువైపు ఉంటాయనేది చూడాలి మరి.

 

Also Read : ‘డిప్యూటీ సీఎం’ ప్రచారంపై నారా లోకేశ్ రియాక్షన్.. నా టార్గెట్ ఇదే.. అసలు విషయం రివీల్.