విశాఖ వైసీపీలో కలకలం సృష్టిస్తున్న ఆ ఇద్దరు ఎవరు, పార్టీ కార్యక్రమాలంటే వారికెందుకు అంత భయం?

మాజీ మంత్రుల్లో ఒకరు విదేశాల్లో విహార యాత్రకు వెళ్లగా, ఇంకొకరు తనకే సంబంధం లేనట్లు వ్యవహరించడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. కీలక నేతలు వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని అంటున్నారు. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చూడాల్సివుంది.

విశాఖ వైసీపీలో కలకలం సృష్టిస్తున్న ఆ ఇద్దరు ఎవరు, పార్టీ కార్యక్రమాలంటే వారికెందుకు అంత భయం?

Gossip Garage : మంత్రి పదవిని సగం.. సగం పంచుకున్న ఆ ఇద్దరు… ప్రతిపక్ష పాత్రకు మాత్రం నువ్వంటే.. నువ్వంటూ తప్పించుకు తిరుగుతున్నారట…. పార్టీ అధికారంలో ఉండగా, అంతా తామే అన్నట్లు రాజకీయాన్ని శాసించిన నేతలు… ఇప్పుడు తమకే సంబంధం లేదంటూ చేతులెత్తుస్తున్నారట… తన పదవికి ఎసరు పెట్టారని ఒకరు… అధికారంలో ఉండగా తనకు సహకరించలేదని ఇంకొకరు ఆరోపించుకుంటూ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారంటున్నారు… విశాఖ వైసీపీలో కలకలం సృష్టిస్తున్న ఆ ఇద్దరు ఎవరు? పార్టీ కార్యక్రమాలంటే వారికెందుకు అంత భయం?

చర్చకు దారితీసిన అమర్నాథ్, అవంతి వ్యవహార శైలి..
విశాఖ రాజకీయాలకు వైసీపీకి సవాల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, అవంతి శ్రీనివాస్‌ వ్యవహారశైలి పార్టీలో అంతర్గతంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. పార్టీ అధికారంలో ఉండగా, ఈ ఇద్దరు మంత్రి పదవిని సగం సగం పంచుకున్నారు. జగన్‌ తొలి క్యాబినెట్‌ విస్తరణలో అవంతికి చాన్స్‌ ఇస్తే.. మూడేళ్ల తర్వాత చేపట్టిన విస్తరణలో గుడివాడ చోటు దక్కించుకున్నారు. ఐతే ఇలా మంత్రి పదవి పంపకమే ఈ ఇద్దరి మధ్య గ్యాప్‌ తీసుకు వచ్చిందంటున్నారు.

ఓటమికి అమర్‌నాథ్‌ బాధ్యత వహించాలని అవంతి డిమాండ్..
2014లో అనకాపల్లి ఎంపీ స్థానానికి ప్రత్యర్థులుగా తలపడిన ఈ ఇద్దరూ.. 2019లో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచినా.. మంత్రి పదవి వల్ల ఇద్దరి మధ్య చిచ్చు ఏర్పడిందని చెబుతున్నారు. తాను సీనియర్‌నని… తనను తప్పించి అమర్నాథ్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని అవంతి తొలి నుంచి జీర్ణించుకోలేకపోతున్నారని ప్రచారం ఉంది. ఇక ఎన్నికల సమయంలో మంత్రిగా ఉన్న అమర్‌నాథ్‌ జిల్లా రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకున్నట్లు వ్యవహరించారని, ముఖ్యంగా విశాఖ నగరంలో ఆయన తీరుతో పార్టీ దెబ్బతిన్నదని అవంతి ఆరోపిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఓటమికి అమర్‌నాథ్‌ బాధ్యత వహించాలని ఆరోపిస్తుండటమే కాకుండా… ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకూ ఆయనే బాధ్యత తీసుకోవాలని చెబుతున్నారంటున్నారు.

మధ్యలో వచ్చిన వారిని నమ్మితే ఇలా మోసమే జరుగుతుందని అవంతిపై ఫైర్..
ఐతే అవంతి ఆరోపణలను కొట్టిపడేస్తున్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌… జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన అవంతే ఓటమికి కారణమని విమర్శిస్తున్నారంటున్నారు. మూడేళ్లు మంత్రిగా పనిచేసిన అవంతి.. విశాఖ నగరంలో పార్టీ బలోపేతానికి చేసిందేమీ లేదని… విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినా, ప్రజల మద్దతు కూడగట్టలేకపోయారని ఆరోపిస్తున్నారంటున్నారు. తాను మంత్రి అయ్యాకే విశాఖకు పరిశ్రమలు తీసుకువచ్చానని… ఐతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడం వల్ల తానేమీ చేయలేకపోయానని ఆరోపిస్తున్నారట… పైగా ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించాల్సి వస్తుందనే ఆలోచనతో…. పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారని అవంతిపై ప్రత్యారోపణలు చేస్తున్నారు గుడివాడ అమర్‌నాథ్‌. తాను తొలి నుంచి వైసీపీలో ఉన్నానని… మధ్యలో వచ్చిన వారిని నమ్మితే ఇలా మోసమే జరుగుతుందని తన అనుచరులతో చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కీలకమైన ఎన్నిక సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లడంపై దుమారం..
ఇలా జిల్లాలో ముఖ్యమైన ఇద్దరు నేతలు బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూడటం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ప్రస్తుతం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నెల 30న పోలింగ్‌ జరగనుండగా, కీలక నేతలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూడటం హాట్‌టాపిక్‌ అవుతోంది. అంతేకాకుండా పార్టీకి కీలకమైన ఎన్నిక సమయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విదేశీ పర్యటనకు వెళ్లిపోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది.

విహార యాత్రలో ఒకరు, ఏమీ పట్టన్నట్లుగా మరొకరు..
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో వైసీపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నా, అధికార పార్టీ ఆకర్షణ మంత్రంతో పలువురు ఓటర్లు గోడ దూకేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి అడ్డుకోవాల్సిన మాజీ మంత్రుల్లో ఒకరు విదేశాల్లో విహార యాత్రకు వెళ్లగా, ఇంకొకరు తనకే సంబంధం లేనట్లు వ్యవహరించడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. కీలక నేతలు వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని అంటున్నారు. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చూడాల్సివుంది.