కూటమి సర్కార్ దూకుడు.. వైసీపీకి మరిన్ని చిక్కులు తప్పవా?

తమను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి క్యాడర్‌లో పెరిగిపోతోంది. అందుకే వారి ఆలోచనలన్నీ కూటమి వైపు ఉసిగొల్పుతున్నట్లు చెబుతున్నారు.

కూటమి సర్కార్ దూకుడు.. వైసీపీకి మరిన్ని చిక్కులు తప్పవా?

Gossip Garage :  ఏపీ రాజకీయాల్లో వైసీపీకి మరిన్ని చిక్కులు తప్పవా? ఇప్పటికే ఘోర ఓటమితో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోగా, ఇప్పుడు పార్టీ నేతలు వరుసగా బైబై చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఖాతా తెరవని గోదావరి జిల్లాల్లో వైసీపీకి పరిస్థితులు ఇంకా ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నేత మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత ఏలూరు కార్పొరేషన్‌ మేయర్‌ రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ పేరూ వినిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జడ్‌పీ చైర్‌పర్సన్‌ కూటమి గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది.

నేడోరేపో 20మంది జెడ్పీటీసీలు జంప్..!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఇప్పటికే ఏలూరు కార్పొరేషన్‌ను కోల్పోయిన వైసీపీ.. ఇప్పుడు జడ్‌పీ పీఠాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోందంటున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన జడ్‌పీ సమావేశంలో వైసీపీ జడ్పీటీసీల తీరును గమనిస్తే… మెజార్టీ సభ్యులు కూటమిలో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు పంపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జడ్పీ చైర్ పర్సన్‌ గంట పద్మశ్రీతో సహా దాదాపు 20 మంది జడ్‌పీటీసీలు నేడోరేపో… కూటమితో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాలో వైసీపీ వ్యవహారాలను పట్టించుకునే వారు లేకపోవడం, తమ పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉండటం వల్ల ప్రభుత్వ సహకారం కోరుతున్న జడ్‌పీ చైర్‌పర్సన్ టీడీపీలో చేరాలని ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జెడ్పీని గుప్పిట పెట్టుకోవాలని నిర్ణయం..
ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి నిమ్మల రామానాయుడు సైతం జడ్‌పీ చైర్ పర్సన్‌ పద్మశ్రీని పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాను కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. జిల్లాలో మొత్తం 15 స్థానాలను కూటమి పార్టీలు కొల్లగొట్టాయి. అయినప్పటికీ జిల్లా పరిషత్‌ కూడా తమ చేతిలో ఉండాలని భావిస్తున్నారు కూటమి నేతలు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు జరగాలంటే స్థానిక సంస్థల్లో బలం ముఖ్యమని భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఏలూరు కార్పొరేషన్‌ను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక జడ్పీని గుప్పిట పెట్టుకోవాలని నిర్ణయించింది. చైర్‌పర్సన్‌ పద్మశ్రీ టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకోగా, 20 మంది జడ్పీటీసీల్లో కొందరు జనసేన, మరికొందరు టీడీపీ అంటున్నారంటున్నారు. స్థానికంగా వారి రాజకీయ అవసరాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ చేరికను వ్యతిరేకిస్తున్న ప్రముఖ ఎమ్మెల్యే..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 48 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం వైసీపీకి 46 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ, జనసేనకు చెరో సభ్యుడు ఉన్నారు. ఇక జడ్పీ చైర్‌ పర్సన్‌తోపాటు 20 మంది కూటమిలో చేరితే జడ్‌పీ కూటమి పరమైనట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా జడ్పీలో ఓటు హక్కు ఉన్నందు వల్ల 20 మంది జడ్పీటీసీలు పార్టీ మారితే… ఎమ్మెల్యేల బలంతో సునాయాశంగా జడ్పీ పీఠాన్ని చేజిక్కుంచుకోవచ్చని లెక్క వేస్తున్నారు. ఐతే జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మశ్రీ చేరికను టీడీపీలోని ఓ ప్రముఖ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఎమ్మెల్యే అభ్యంతరం వల్లే చేరిక ఆలస్యమైందని… లేని పక్షంలో ఇప్పటికే జడ్పీలో పసుపు జెండా ఎగిరేదని అంటున్నారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ భర్తతో తీవ్ర వాగ్వాదం..
జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మశ్రీ భర్తకు టీడీపీ ఎమ్మెల్యేకు మధ్య ఎన్నికల సమయంలో తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సదరు ఎమ్మెల్యే… జడ్‌పీ చైర్‌ పర్సన్‌ చేరికను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం జడ్పీపై టీడీపీ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఎవరు వచ్చినా కాదనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై మంత్రి నిమ్మల… సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.

వెళ్లిపోతున్నా ఏ మాత్రం పట్టించుకోని వైసీపీ..
మరోవైపు జడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు జడ్పీటీసీలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్నా, వైసీపీలో మాత్రం ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా రెండుగా విభజన కావడంతో ఇద్దరు నేతలు రెండు పార్టీల అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో కొన్ని మండలాలు తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్లాయి. దీంతో జడ్పీటీసీలతో మాట్లాడే బాధ్యత ఎవరు తీసుకోవాలనేది వైసీపీ తేల్చుకోలేకపోతోంది. ఏలూరు జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన మాజీ మంత్రి ఆళ్ల రాజీనామాతో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు ఏలూరు బాధ్యతలు అప్పగించారు.

వైసీపీ కేడర్ లో పెరిగిపోతున్న అసంతృప్తి..
కైకలూరు ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ గతంలో కృష్ణా జిల్లాలో ఉండేది. దీంతో దూలం నాగేశ్వరరావుకు ఉమ్మడి జిల్లా వ్యవహారాలపై పట్టు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో చొరవ తీసుకోవాల్సిన మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, శ్రీరంగనాథ రాజు వంటి వారు మాకెందుకులే అన్నట్లు మౌనాన్ని ఆశ్రయించారు. ఈ కారణంగా తమను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి క్యాడర్‌లో పెరిగిపోతోంది. అందుకే వారి ఆలోచనలన్నీ కూటమి వైపు ఉసిగొల్పుతున్నట్లు చెబుతున్నారు.

Also Read : ఏరుకన్నా తక్కువైన బుడమేరు ఉప్పెనలా విజయవాడపై విరుచుకుపడటానికి కారణం వారేనా? చంద్రబాబు అంత సాహసం చేస్తారా?