బాబుతో అట్లుంటది..! అపోజిషన్‌ను డైలమాలో పడేసిన చంద్రబాబు మార్క్ రాజకీయం..

అసెంబ్లీ వేదికగా పోరాడాల్సిన అపోజిషన్.. మీడియా వేదికగా ప్రశ్నిస్తామని చెప్తుండటం ఏంటంటూ చర్చ జరుగుతోంది.

బాబుతో అట్లుంటది..! అపోజిషన్‌ను డైలమాలో పడేసిన చంద్రబాబు మార్క్ రాజకీయం..

Gossip Garage Cm Chandrababu Strategy (Photo Credit : Google)

Updated On : November 16, 2024 / 8:39 PM IST

Gossip Garage : ఆయన మార్క్ పాలిటిక్సే వేరు. ఆ నేత ఆలోచన తీరు కూడా సెపరేటు. ఆయన ప్రతీ నిర్ణయంలో థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ కనిపిస్తుంటుంది. అపోజిషన్‌ వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ మాస్టర్ మైండ్ స్కెచ్ వేశారు ఏపీ సీఎం. విపక్షం సభకు రాకపోవడంతో స్వపక్ష ఎమ్మెల్యేలతోనే ప్రజల తరఫున గళం వినిపించేలా ప్లాన్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేద్దాం.. మనమే సమాధానాలూ చెబుదామంటూ..అసెంబ్లీ సెషన్‌ తీరునే మార్చేశారు. చంద్రబాబు ప్లాన్‌తో వైసీపీ డైలమాలో పడిందా? స్వపక్ష ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష రోల్ ప్లే చేయించడం వెనక వ్యూహం ఏంటి.?

స్వపక్ష ఎమ్మెల్యేలతో ప్రజల తరఫున గళం వినిపించేలా టీడీపీ ప్లాన్..
అపోజిషన్‌ సభకు రాదు. అసెంబ్లీకి వెళ్తే మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వరంటూ సాకు చెబుతూ వైసీపీ డుమ్మా కొడుతోంది. మీడియా ద్వారా కూటమి ప్రభుత్వ బడ్జెట్..విధానాలపై ప్రశ్నిస్తామంటున్నారు. సభకు వెళ్లకుండా అధికార పార్టీని డైలమాలో పడేద్దామనుకున్న వైసీపీ వ్యూహానికి..సీఎం చంద్రబాబు తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు. అపోజిషన్ సభకు రాకుంటే వాళ్లిష్టం. మనం మాత్రం ప్రజల పక్షమే. ప్రశ్నలు మనమే వేద్దాం.. సమాధానాలు మనమే చెబుదాం.. ప్రజా సమస్యలకు పరిష్కారం కూడా చూపిద్దామంటూ అసలుసిసలు రాజకీయానికి తెరదీశారు ఏపీ సీఎం చంద్రబాబు.

మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు కాబట్టే సభకు రావట్లేదని వైసీపీ అంటుంటే..స్వపక్ష ఎమ్మెల్యేలతో ప్రజల తరఫున గళం వినిపించే ప్లాన్ చేసింది టీడీపీ. గ్రౌండ్‌ లెవల్‌లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేలా కొందరు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారట సీఎం చంద్రబాబు. అపోజిషన్‌ రావట్లేదు కాబట్టి..ఎంత సేపు భజన కాకుండా..సమస్యలు ఉన్నాయ్..వాటిని సాల్వ్‌ చేస్తామని సభ ద్వారే ప్రజలకు భరోసా ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచన.

వైసీసీ సభ్యుల తరహాలో సమస్యల ప్రస్తావన..
164 మంది కూటమి సభ్యులు..11మంది ప్రతిపక్ష సభ్యులు.. అలాటంప్పుడు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరంటూ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. తమ మీద నిందలు వేసి..బాబు గొప్పలు చెప్పుకోవడానికి తప్ప..సభను ప్రజల కోణంలో నడపటం లేదని ఆరోపిస్తోంది. దీంతో వైసీపీకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజా సంక్షేమం కోసం ఏం చేయాలనుకుంటున్నాం..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి.. ఇలా అన్నింటిపై క్లారిటీ ఇస్తూనే అపోజిషన్‌ రోల్‌ను కూడా ప్రజలకు కనిపించేలా ప్రయత్నం చేస్తోంది. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిప‌క్ష పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ స‌భ్యులు స‌భలో ఉంటే ఎలా ప్రశ్నిస్తారో అలానే సమస్యలను లేవనెత్తుతున్నారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు. దీంతో ఏకపక్షంగా సాగినట్లు అనిపించి ఏపీ అసెంబ్లీ సెషన్‌ తీరు ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం ఉద‌యం నుంచి స‌భా వ్యవ‌హారాల్లో మార్పు కనిపిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫేస్‌ చేస్తున్న సమస్యలను ప్రస్తావించేలా ప్లాన్..
గ‌తంలో 2017-19 మ‌ధ్య కూడా వైసీపీ ఇలానే స‌భ‌కు రాకుండా డుమ్మా కొట్టింది. అప్పట్లో త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకున్నార‌ని ఆరోపిస్తూ..జగన్‌ స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పాదయాత్ర చేశారు. ఆ స‌మ‌యంలో కూడా ప్రజ‌ల గొంత‌కైన టీడీపీ.. జిల్లాకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేల‌ను స‌మ‌స్యల కోసం కేటాయించింది. ఇలానే ఇప్పుడు కూడా..చంద్రబాబు సూచ‌న‌ల‌తో 30 మంది ఎమ్మెల్యేలు..విప‌క్షం పాత్ర పోషించేందుకు రెడీ అయ్యారట. వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్యలే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫేస్‌ చేస్తున్న సమస్యలను ప్రస్తావించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స‌మాధానం రాబ‌ట్టడం ద్వారా ప్రజ‌ల స‌మ‌స్యల‌కు స‌భ‌లో ప‌రిష్కారం ల‌భించేలా ప్రయ‌త్నం చేస్తున్నారు.

చర్చనీయాంశంగా మారిన వైసీపీ వైఖరి..
స్వపక్షంలోనే విపక్ష రోల్‌ ప్లే చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఆకట్టుకుంటుంటే..వైసీపీ వైఖరి చర్చనీయాంశంగా మారింది. సభకు హాజరై..మాట్లాడే సమయం ఇవ్వకపోతే బైకాట్‌ చేస్తే ఓకే. కానీ సభకు వెళ్తే మైక్‌ ఇవ్వరని ముందే ఊహించుకుని..డుమ్మా కొట్టడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ వేదికగా పోరాడాల్సిన అపోజిషన్..మీడియా వేదికగా ప్రశ్నిస్తామని చెప్తుండటం ఏంటంటూ చర్చ జరుగుతోంది. అయితే తమకు మైక్‌ ఇవ్వటం లేదని కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్లాన్ జగన్‌ వేస్తే..తమ ఎమ్మెల్యేలతోనే ప్రతిపక్షం వాయిస్‌ వినిపించి అపోజిషన్‌ను ఇరకాటంలో పడేస్తున్నారు సీఎం చంద్రబాబు.

 

Also Read : ఏపీలో త్వరలో సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ యాక్ట్..! అసలేంటీ చట్టం, టార్గెట్‌ ఎవరు?