Biswabhusan Harichandan : ఏపీపై ప్రశంసలు కురిపించిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

Biswabhusan Harichandan : ఏపీపై ప్రశంసలు కురిపించిన గవర్నర్

Biswabhusan Harichandan

Updated On : July 24, 2021 / 5:21 PM IST

Biswabhusan Harichandan : ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర ప్రజల నుండి లభించిన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరచిపోలేనని వివరించారు. రాష్ట్ర ప్రధమ పౌరునిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తి అయిన శుభసందర్భంలో గవర్నర్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు రాజ్ భవన్ ప్రాంగణంలో శనివారం మొక్కలు నాటారు.

కరోనా విపత్కర పరిస్ధితుల కారణంగా అతి నిరాడంబరంగా కార్యక్రమాన్ని నిర్వహించగా కేవలం రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. కోవిడ్ పరిమితుల కారణంగా మరే ఇతర కార్యక్రమాలకు గవర్నర్ అంగీకరించలేదు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత రెండేళ్ళలో అటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇటు రాజ్ భవన్ బృందం నుండి తనకు మంచి సహకారం లభించిందని అన్నారు.

గత రెండు సంవత్సరాలలో రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ చెట్ల పెంపకం, రక్తదానం వంటి కార్యక్రమాలలో పూర్వం ఉన్న అన్ని రికార్డులను అధికమించి కొత్త రికార్డులను నెలకొల్పిందని, కష్టతరమైన కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కూడా ప్రజల కోసం వారు ఎంతో కృషి చేశారని అన్నారు. రక్తం అందుబాటులో లేకపోవటం వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చూసేలా రెడ్ క్రాస్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారని స్పష్టం చేసారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు గవర్నర్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.