Rain Alert: రాబోయే నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్పారంటే?
రాబోయే నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి..

AP Rains
AP Rain Alert: ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా.. నదులు, వాంగులువంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోకముందే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాబోయే నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. కోస్తాలో ఇవాళ పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. తీరం వెంబడి 40 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తం ఉండాలని సూచించారు.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఇవాళ ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా 24 గంటలు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉందని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సిసోడియా విజ్ఞప్తి చేశారు.