Tdp Tickets Row : టీడీపీలో హైటెన్షన్.. ఆ 16 సీట్లలో అభ్యర్థులపై తీవ్ర ఉత్కంఠ, సీనియర్ల భవిష్యత్తు ఏంటి?

పొత్తుల్లో భాగంగా కీలకమైన స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పసుపు దండు.. ఓవైపు అగ్గి పుట్టిస్తుండగా.. మరోవైపు సీట్లు దక్కని సీనియర్లు భవిష్యత్తు వ్యూహాలతో పార్టీకి డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నట్లు చెబుతున్నారు.

Tdp Tickets Row : టీడీపీలో హైటెన్షన్.. ఆ 16 సీట్లలో అభ్యర్థులపై తీవ్ర ఉత్కంఠ, సీనియర్ల భవిష్యత్తు ఏంటి?

Tdp Tickets Row

Tdp Tickets Row : ఎన్నడూ లేనట్లు టీడీపీ చరిత్రలోనే తొలిసారి ఎన్నికల షెడ్యూల్ ముందే అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. పొత్తులు, సీట్ల సర్దుబాటు అన్నీ కొలిక్కి తెచ్చేశారు. పోటీ చేద్దామనుకున్న 144 సీట్లలో 128 అభ్యర్థుల పేర్లను ముందే ప్రకటించడం ఓ రికార్డు కాగా.. ఇంకా బ్యాలెన్స్ ఉన్న 16 సీట్లే అధినేతకు తలనొప్పిగా మారాయని అంటున్నారు. ఈ 16 సీట్లలో చంద్రబాబు లెక్క ఒకటైతే అక్కడ స్థానిక లీడర్లు ఇంకో లెక్కలు వేస్తుండటం చికాకుగా మారిందట.

తెలుగుదేశం పార్టీలో రెండో జాబితా విడుదలైన తర్వాత లెక్కలన్నీ మారుతున్నట్లు కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా కీలకమైన స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పసుపు దండు.. ఓవైపు అగ్గి పుట్టిస్తుండగా.. మరోవైపు సీట్లు దక్కని సీనియర్లు భవిష్యత్తు వ్యూహాలతో పార్టీకి డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నట్లు చెబుతున్నారు.

గంటా, ఉమ, సోమిరెడ్డి, వసంత రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు..
తొలి, మలి జాబితాలో సీట్లు దక్కని సీనియర్లు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతలైన కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహిళా నేత గౌతు శిరీషకు టికెట్ ప్రకటించలేదు.

మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సీటుపై కొంత ఊగిసలాట నడుస్తుండగా.. ఎలాగైనా భీమిలిలో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన జనసేన నుంచి భీమిలి టికెట్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గంటా పోటీపై చంద్రబాబు పట్టిన పట్టు వీడటం లేదని తెలుస్తోంది. అయితే చీపురుపల్లి లేదంటే పార్టీకి సేవ చేయాలని చంద్రబాబు తెగేసి చెబుతుండటంతో.. గంటా ప్రత్యామ్నాయం వెతుకున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుపై కళా వెంకటరావు ఒత్తిడి..
ఇక మరో సీనియర్‌ నేత కళా వెంకటరావుతోపాటు ఆయన సోదరుడి కుమారుడైన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున టికెట్‌పైనా హైడ్రామా కొనసాగుతోంది. ఎచ్చెర్ల టికెట్‌ను కళా ఆశిస్తుండగా, స్థానికంగా ఆయనకు పార్టీలో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో విజయనగరం ఎంపీగా పోటీ చేయమని పార్టీ ప్రతిపాదిస్తుండటంతో తర్జనభర్జన పడుతున్నారు కళా వెంకటరావు. గత రెండు రోజులుగా సన్నిహితులతో చర్చిస్తున్న కళా.. ఎచ్చెర్ల సీటు కోసం అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు.

టీడీపీకి కత్తిమీద సాములా అభ్యర్థుల ఎంపిక..
ఇదే సమయంలో నాగార్జున సీటుపైనా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో విజయనగరం ఎంపీ, చీపురుపల్లి, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక టీడీపీకి కత్తిమీద సాములా తయారైందంటున్నారు. చీపురుపల్లిలో గెలిచే అభ్యర్థిని బరిలోకి దించడం ద్వారా ఉత్తరాంధ్రలో సీనియర్‌ మంత్రి బొత్స ఆధిపత్యానికి బ్రేక్‌ వేయాలని ప్లాన్‌ చేస్తున్నారు చంద్రబాబు. దీనికి ఇద్దరు సీనియర్‌ నేతలు ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాల్సి వుంది.

డైలమాలో ఉమ సీటు, సిద్ధంగా లేనంటున్న బొడే ప్రసాద్..
ఇక కీలమైన కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు సీనియర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని అంటున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరికతో సీనియర్‌ నేత దేవినేని ఉమ సీటు డైలమాలో పడింది. ఉమాను పక్కనే ఉన్న పెనమలూరుకు మార్చుతారంటూ ప్రచారం జరిగినా, ఆ సీటు వదులుకోడానికి మాజీ ఎమ్మెల్యే బొడే ప్రసాద్‌ సిద్ధంగా లేరు. ఆరు నూరైనా తాను పోటీ చేస్తానని బొడే ప్రసాద్‌ ప్రకటన చేయడంతో ఉమా సీటుపైనా హైడ్రామా కొనసాగుతోంది. ఇదే సమయంలో మైలవరం టికెట్‌పై అభ్యంతరం లేకపోయినా, వసంత కృష్ణప్రసాద్‌ పేరు ప్రకటించకపోవడంతో ఏదైనా మార్పు చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వరుసగా నాలుగు సార్లు ఓడిన సోమిరెడ్డికి నో టికెట్?
ఇదే విధంగా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి స్థానంపైనా తర్జనభర్జన కొనసాగుతోంది. ఈ సీటును సీనియర్‌ నేత సోమిరెడ్డి ఆశిస్తున్నారు. వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిన సోమిరెడ్డికి మళ్లీ బరిలోకి దింపడంపై అధిష్టానం ఆలోచనలో పడిందంటున్నారు. ఐతే ఐదేళ్లుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సోమిరెడ్డిని తప్పించడం భావ్యం కాదనే కోణంలోనూ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో సోమిరెడ్డికి ప్రత్యామ్నాయంగా ఆయన కుటుంబంలోనే ఎవరో ఒకరిని పోటీకి పెట్టే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.

ఇక కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్‌ ఇస్తామని పార్టీలోకి చేర్చుకున్నారు. ఐతే అక్కడ స్థానికంగా వ్యతిరేకత ఉండటంతో గుంతకల్లు సీటును ఇంతవరకు ప్రకటించలేదు. ఇదే విధంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, విజయనగరం జిల్లా ఎస్‌.కోట, కాకినాడ జిల్లాలోని కాకినాడ సిటీ, ప్రకాశం జిల్లా దర్శి, బాపట్ల జిల్లా చీరాల, అన్నమయ్య జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లాలోని ఆలూరు, కోనసీమ జిల్లాలోని అమలాపురం, అనంతపురం అర్బన్‌ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.

చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..
ఈ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు సీట్లు ఆశిస్తుండగా, వారికి పోటీగా కొత్తగా పార్టీలో చేరిన వారు, ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామిక వేత్తలు రంగంలోకి దిగి టికెట్లు తన్నుకుపోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఒత్తిళ్ల మధ్య 16 స్థానాలను పెండింగ్‌లో పెట్టిన అధినేత చంద్రబాబు.. చివరికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Also Read : భగ్గుమన్న అసంతృప్తులు.. ఎందుకిలా? కారణం ఎవరు? కూటమిలో కుంపటిపై తెలకపల్లి రవి విశ్లేషణ..