Kimidi Kala Venkata Rao : పుంగనూరు ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? నిప్పులు చెరిగిన కళా వెంకట్రావు
ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వైసీపీకి ఉనికి లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించాలని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. Kala Venkata Rao

Kimidi Kala Venkata Rao Fires On YSRCP (Photo : Facebook)
Kimidi Kala Venkata Rao Fires On YSRCP : వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావు. పుంగనూరు ఏమైనా పాకిస్తాన్ లో ఉందా? అంటూ ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం నుండి కుప్పంకు టీడీపీ కార్యకర్తలు చేపట్టిన సైకిల్ యాత్రపై వైసీపీ సైకోల ప్రవర్తన కలచివేసిందని కళా వెంకట్రావు వాపోయారు. ఉత్తరాంధ్రను అవమానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పుంగనూరు ఏమైనా పాకిస్తాన్ లో ఉందా? దేశ సరిహద్దుల్లో లేని ఆంక్షలు పుంగనూరులో ఎందుకు? అని నిప్పులు చెరిగారు కళా వెంకట్రావు.
వైసీపీకి ఉనికి లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు..
స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై రెండు రోజులైనా సీఎం జగన్ స్పందించకపోవడం విచారకరం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వైసీపీకి ఉనికి లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించాలని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే..
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ నాయకుడి అరెస్ట్ ను నిరసిస్తూ శ్రీకాకుళానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. సైకిల్ కు టీడీపీ జెండాలు పెట్టుకుని, చంద్రబాబు బొమ్మలున్న ఎల్లో టీషర్టులను ధరించి సైకిల్ యాత్ర చేస్తున్నారు. వీరి సైకిల్ యాత్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చేరుకుంది. అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది.
బూతులు తిట్టి, చొక్కాలు విప్పించిన వైసీపీ కార్యకర్త..
పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. టీడీపీ కార్యకర్తలను దూషించాడు. బూతులు తిట్టాడు. ఇది పెద్దిరెడ్డి అడ్డా, ఇక్కడ ఎలా యాత్ర చేస్తారు అని నిలదీశాడు. మీ నాయకుడు ఎవర్రా, పిలవండి రా అంటూ దౌర్జన్యంగా మాట్లాడాడు. అంతేకాద టీడీపీ జెండాలు, చొక్కాలు తీస్తేనే పుంగనూరు నియోజకవర్గం నుంచి కదలనిస్తామని బెదిరించాడు. అక్కడికక్కడే వారి చొక్కాలు విప్పించాడు. ఇది పెద్దిరెడ్డి నియోజకవర్గమంటూ దబాయించాడు.
Also Read : మేము అధికారంలోకి రాగానే దీనిపైనే తొలి విచారణ జరిపిస్తాం: పవన్ కల్యాణ్
బీహార్ లో కూడా ఇలాంటి అరాచక పరిస్థితులు లేవు..
పైగా ఈ వ్యవహారాన్ని వీడియో తీయమని తన వాళ్లకు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరీ ఇంత రౌడీయిజమా? దౌర్జన్యమా? అని ధ్వజమెత్తుతున్నారు. జగన్ పాలనలో సైకిల్ తొక్కినా నేరమే, పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని వాపోయారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి ఉదాహరణ అన్నారు. బీహార్ లో కూడా ఇలాంటి అరాచక పరిస్థితులు లేవన్నారు. టీడీపీ కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా? అని ప్రశ్నిస్తున్నారు.