జగనన్న విద్యా కానుక..రూ. 650 కోట్లతో విద్యార్థులకు కిట్లు

  • Published By: madhu ,Published On : October 8, 2020 / 06:19 AM IST
జగనన్న విద్యా కానుక..రూ. 650 కోట్లతో విద్యార్థులకు కిట్లు

Updated On : October 8, 2020 / 7:07 AM IST

Jagananna Vidya Kanuka : మరో ప్రతిష్టాత్మక పథకానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో పథకాన్ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యాకానుకను ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా.. 42 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలగనుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభిస్తోంది.



ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనుంది. జూన్‌లో స్కూళ్లు ప్రారంభం కాగానే ఏపీలో జగనన్న విద్యా కానుకను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే కరోనా కారణంగా విద్యా సంస్థలు తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. నవంబర్‌ రెండో తేది నుంచి స్కూళ్లను తెరవనున్నారు.



అయితే విద్యాకానుక కిట్లు ముందుగానే విద్యార్థులకు అందితే.. పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థులు యూనీఫామ్ కుట్టించుకునే అవకాశం ఉంటుందని భావించింది ప్రభుత్వం.



జగనన్న విద్యా కానుక కింద.. 3 జతల యూనిఫాం, నోట్ బుక్స్.. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, ఒక జత షూ.. మూడు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ను విద్యార్ధులకు ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల 34వేల 322 మంది విద్యార్ధులకు సుమారు రూ. 650 కోట్ల ఖర్చుతో .. స్టూడెంట్‌ కిట్లు అందచేస్తారు. మగపిల్లలకు స్కై బ్లూ రంగు, అమ్మాయిలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు ఇస్తారు. కోవిడ్‌ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేయనున్నారు.



సీఎం వైఎస్ జగన్.. కృష్ణా జిల్లా కంకిపాడు జిల్లా పరిషత్ స్కూల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటి తరగతి నుంచి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు జగన్. ఇప్పటికే జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, నాడు-నేడు ఇలా వరుసగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.



విద్యాశాఖలో సంక్షేమ పథకాల ద్వారా డ్రాప్ అవుట్స్‌ని తగ్గించడం, ప్రాథమిక స్ధాయి నుంచే అత్యుత్తమ విద్యని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. జగన్న కానుక ద్వారా విద్యార్థులకు కిట్‌లు అందించడం ద్వారా.. ఆర్థిక భారం తగ్గుతుందని పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.