Congress Celebrations: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ భారీగా సంబరాలు జరుపుకున్నారు.

Congress Celebrations: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు

Updated On : May 13, 2023 / 4:22 PM IST

AP Congress Celebrations: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం హస్తం పార్టీలో ఫుల్ జోష్ నింపింది. పూర్తి మెజారిటీతో కన్నడ సీమలో తమ అధికారంలోకి రాబోతుండడం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల వెల్లడి (Karnataka Election Result 2023) నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. కర్ణాటకలో తమ పార్టీ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు పలు జిల్లాల్లో సంబరాలు మిన్నంటాయి.

బీజేపీకి ‌చెంప పెట్టు: రుద్రరాజు
విజయవాడ ఆంధ్రరత్నభవన్ లో ఏపీసీసీ నేతల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మహిళా నేత సుంకర పద్మశ్రీ ఇతర ముఖ్య నాయకులు స్వీట్లు పంచి సంతోషం వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ‌చెంప పెట్టు అని ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాల్లో మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Sake Sailajanath) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విజయం సాధించింది. కర్ణాటక ప్రజలు మత రాజకీయాల్ని తిరస్కరించారు. దేవున్ని, మతాలను అడ్డం పెట్టుకుని బీజేపీ గెలవాలనుకుంది. మత రాజకీయాల్ని చేసి దేశాన్ని అమ్మేస్తున్న వారికి బుద్ధి చెప్పారు. ప్రజలు, ప్రజాస్వామ్యశక్తులు కలసి నియంతృత్వ పాలనకు స్వస్తి పలికాయి. దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మరింత పట్టు సాధిస్తుందని అన్నారు.

బీజేపీకి సరైన బుద్ధి చెప్పారు..
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా సంబరాలు చేసుకున్నాయి. నియోజకవర్గ ఇన్ ఛార్జి రంగన అశ్వర్థనారాయణ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశ్వర్థనారాయణ మాట్లాడుతూ.. బీజేపీకి కర్ణాటక ప్రజలు సరైన బుద్ధి చెప్పారని అన్నారు. రానున్న రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, దీనికి కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

Also Read: జేడీఎస్‌కు షాకిచ్చిన కన్నడ ఓటర్లు.. కుమారస్వామి ఆశలు గల్లంతు