Kovvur : సీఎం జగన్ 20లక్షలు ఇచ్చారు, దయచేసి రాజకీయాలకు వాడుకోవద్దు- కొవ్వూరు మహేంద్ర కుటుంబం విజ్ఞప్తి
Kovvur Mahendra Incident : మహేంద్ర ఉదంతాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని, దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. దయచేసి మహేంద్ర మృతి ఘటనను ఎవరూ..

Kovvur Mahendra Incident (Photo : Google)
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన దళిత యువకుడు మహేంద్ర ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. ఇది వైసీపీ హత్య అని ఆరోపించాయి. ఈ వ్యవహారంపై మహేంద్ర కుటుంబం స్పందించింది. మహేంద్ర మృతిని రాజకీయం చేయొద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
మహేంద్ర ఉదంతంపై ప్రభుత్వం స్పందించిన తీరుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మహేంద్ర ఉదంతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ స్పందించి, తమ కుటుంబానికి అండగా నిలిచారని వారు తెలిపారు. ఈ మేరకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు.
Also Read : పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
విషయం తెలిసిన వెంటనే తమ కుటుంబాన్ని పరామర్శించాల్సిందిగా మంత్రి మేరుగ నాగార్జునను సీఎం జగన్ ఆదేశించారని, సీఎం ఆదేశాల మేరకు మంత్రి వచ్చి తమ కుటుంబానికి ఓదార్పునిచ్చారని మహేంద్ర కుటుంబసభ్యులు వెల్లడించారు. అంతేకాదు తమ కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశారన్నారు. దాంతో పాటు ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించి కూడా ఇస్తామని, ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారని మహేంద్ర కుటుంబసభ్యులు తెలిపారు.
అంతేకాకుండా మహేంద్ర మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కష్ట కాలంలో తమ కుటుంబం వెన్నంటి ఉన్న జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కాగా, మహేంద్ర ఉదంతాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని, దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. దయచేసి మహేంద్ర మృతి ఘటనను ఎవరూ రాజకీయం చేయొద్దని అతడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దొమ్మేరు గ్రామంలో చెలరేగిన ఫ్లెక్సీ వివాదంలో మహేంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read : చంద్రబాబును పురందేశ్వరి వెనకేసుకు రావడం విడ్డూరం : ఆమంచి
కాగా, మహేంద్ర ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న మహేంద్ర కుటుంబీకులను పలు పార్టీల నాయకులు పరామర్శించారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మహేంద్ర మరణానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాని కోరారు.