Vallabaneni Vamshi: వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన మెడకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది.

Vallabaneni Vamshi: వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు

Vallabhaneni Vamsi

Updated On : February 26, 2025 / 11:56 AM IST

Vallabaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన మెడకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. అధికారంలో ఉన్న సమయంలో వంశీ భూదందాలు, కబ్జాలు, మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంశీపై మరో మూడు కేసులను కృష్ణా జిల్లా పోలీసులు నమోదు చేశారు. ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్ లతోపాటు మళ్లీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

 

ఆత్మకూరులో ఓ పొలం వివాదంలో వంశీ ఆదేశాలతో అతని అనుచరుల పేరుతో దౌర్జన్యంగా పొలం రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో ఎవరికి చెప్పలేదని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

భూమిని కబ్జా చేశాడని ఓ న్యాయవాది మంగళవారం గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేశారని, ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందని ఫిర్యాదు చేయడంతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

 

ఈనెల 13వ తేదీన వంశీతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరుపర్చగా ఈనెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించారు. కాగా.. రిమాండ్ పూర్తికావడంతో జైలు నుంచే వర్చువల్ విధానంలో న్యాయాధికారి ఎదుట నిందితులను పోలీసులు హాజరుపర్చారు. దీంతో వల్లభనేని వంశీతోపాటు ఇద్దరు నిందితులకూ వచ్చే నెల 11వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి మంగళవారం ఉత్తర్వులిచ్చారు.