చంద్రబాబు, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలపై కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటనలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు పలు ప్రశ్నలు సంధించారు.

KVP Ramachandra Rao comments on chandrababu, ys jagan delhi visit
KVP Ramachandra Rao: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటనలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు పలు ప్రశ్నలు సంధించారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీరిద్దరూ ఎందుకు ఢిల్లీ వెళ్లారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమా, స్వప్రయోజనాల కోసమా అంటూ నిలదాశారు. జగన్, చంద్రబాబు.. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికే హస్తిన బాట పట్టారని కేవీపీ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.
బీజేపీతో ఎందుకు కలవాలనుకుంటున్నారు?
చంద్రబాబు సమయాలకూల రాజకీయ చతురుడు, మహామహులను పల్టీలు కొట్టించిన ఘనత ఆయనకే చెందుతుందని కేవీపీ విమర్శించారు. తన రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారని.. 2019లో పొత్తుల విషయంలో రాహుల్ గాంధీని పల్టీ కొట్టించారని వెల్లడించారు. అవకాశవాదంతో ప్రతీ ఎన్నికల్లోనూ ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఒకసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారని, తర్వాత బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారని చెప్పారు. అభద్రతా భావం కలిగినప్పుడల్లా చంద్రబాబుకు జాతిప్రయోజనాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీతో ఎందుకు కలవాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు చందబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీలో అవినీతి కేంద్రానికి కనబడదా?
సీఎం జగన్ అవినీతికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారని కేవీపీ ఆరోపించారు. అవినీతి ఆరోపణలతో రాష్ట్రాల్లో మంత్రులు, పెద్ద స్ధాయి నేతలు అరెస్టవుతారు కానీ ఏపీలో ఎందుకు జరగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో అవినీతి కేంద్రానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో మంత్రులు, అధికారులపై చర్యలకు మోదీ అంగీకరించరని చెప్పారు. మోదీ సహకారం లేకుండా ఏపీ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయగలదా అని అడిగారు.
Also Read: ఢిల్లీలో గంటసేపు చంద్రబాబు మాయం.. వెంటనే బయటకు వచ్చిన ఫేక్ సర్వే..
పోలవరం ప్రాజెక్టును కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఏపీ ప్రజలను టీడీపీ, వైసీపీ మళ్లీ మభ్యపెడుతున్నాయని కేవీపీ విమర్శించారు. సీట్ల పంపకం, స్వీట్లు పంచుకోవడం, వాటాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఈ రెండు పార్టీలకు పట్టవని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే పార్టీ కాంగ్రెస్ అని, నిరుద్యోగం పోవాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలని కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.