Goody Bye To Ysrcp : వైసీపీకి రాం రాం.. వరుసగా పార్టీని వీడుతున్న నేతలు.. ఎందుకిలా, కారణం ఎవరు?

అటు రాజకీయ నాయకులు, ఇటు సినిమా రంగానికి చెందిన వారు.. వరుసగా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు.

Goody Bye To Ysrcp : వైసీపీకి రాం రాం.. వరుసగా పార్టీని వీడుతున్న నేతలు.. ఎందుకిలా, కారణం ఎవరు?

Updated On : November 22, 2024 / 5:37 PM IST

Goody Bye To Ysrcp : వైసీపీని నేతల రాజీనామాలు కలవర పెడుతున్నాయి. వరుసగా పార్టీని వీడుతున్నారు పలువురు నేతలు. ఇద్దరు సినీ నటులు కూడా ఉన్నారు. నిన్న నటుడు పోసాని కృష్ణ మురళి ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లనన్నారు. తన కుటుంబం కోసమే పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు. తనను తిడుతున్నారనో, లేదా అరెస్ట్ చేస్తారనో అని భయపపడి రాజకీయాలకు దూరంగా ఉండటం లేదన్నారు. తప్పు చేసిన వారిపైనే తాను విమర్శలు చేస్తానని, అందరిపై కాదని పోసాని గుర్తు చేశారు.

ఫస్ట్ నుంచి వైసీపీకి సపోర్ట్ గా ఉన్న సినీ నటుడు అలీ ఈ ఏడాది జూన్ లో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ.. రాష్ట్రవ్యాప్తంగా జగన్ పార్టీ తరుపున ప్రచారం కూడా నిర్వహించారు. ఆ తర్వాత అధికారంలోకి వైసీపీ రావడంతో అలీకి రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ పదవి, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి.. ఇలాంటి పదవులు వస్తాయని తెగ ప్రచారం జరిగింది. అయితే, అవన్నీ ప్రచారానికే పరిమితం అయ్యాయి. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రచారం చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ, ఎన్నికల సమయంలో అలీ ఎక్కడా కనిపించలేదు.

ఇక, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అలీ వైసీపీని వీడారు. ఇక, తాను ఏ పార్టీలో లేనని, తాను ఏ పార్టీకి కూడా సపోర్ట్ కాదని తేల్చి చెప్పారు అలీ. ఇక మీద తాను పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెడతానని చెప్పారు. ఐదేళ్లకు ఒకసారి కామన్ మ్యాన్ లా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటానని అలీ తెలిపారు.

ఇక వైసీపీకి సపోర్ట్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న సినీ నటి శ్రీరెడ్డి. ఆమె పార్టీకి సపోర్ట్ గా ఉంటూ పోస్టులు పెట్టే వారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలే టార్గెట్ గా శ్రీరెడ్డి ఎన్నో పోస్టులు పెట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై తప్పుడు పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేతలు ఇస్తున్న ఫిర్యాదులతో శ్రీరెడ్డి స్పందించారు. ఇకపై వైసీపీకి, రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయనన్నారు శ్రీరెడ్డి.

ఇప్పటికే బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సామినేని ఉదయభాను, వాసిరెడ్డి పద్మ లాంటి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు సినిమా రంగానికి చెందిన నేతలు కూడా గుడ్ బై చెబుతున్నారు. మరికొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడతారనే ప్రచారం జోరందుకుంది.

రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ క్రిష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇక ఎమ్మెల్సీలు పోతుల సునీత, చక్రవర్తి కూడా గుడ్ బై చెప్పేశారు. వారి బాటలోనే మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీరుపై నేతల్లో అసంతృప్తే ఈ రాజీనామాలకు కారణం అంటున్నారు. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీలో పరిస్థితులు ఏ మాత్రం మారలేదన్నది కొందరి సీనియర్ల వాదన.

 

Also Read : మూడు నాలుగు రోజుల్లో బ్లాస్టింగ్‌ న్యూస్ రాబోతుందా? వైసీపీ కీలక నేతలను వెంటాడుతున్న అరెస్టుల టెన్షన్..