తిరుపతిలో 14 రోజులపాటు లాక్ డౌన్..కరోనా కేసులు పెరుగుతుండటంతో నిర్ణయం

  • Published By: bheemraj ,Published On : July 20, 2020 / 08:27 PM IST
తిరుపతిలో 14 రోజులపాటు లాక్ డౌన్..కరోనా కేసులు పెరుగుతుండటంతో నిర్ణయం

Updated On : July 20, 2020 / 8:40 PM IST

చిత్తూరు జిల్లాలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 14 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుంది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై వాహనాలు తిరగకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తిరుమలకు వెళ్లే వాహనాలకు బైపాస్ రోడ్డు ద్వారా అనుమతిస్తామని చెప్పారు.

తిరుపతిలో రేపటి నుంచి 14 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ఇవాళ తిరుపతిలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే నిత్యవసరాల కొనుగోలుకు అవకాశం కల్పించారు.

పాల దుకాణాలు, మెడికల్ షాపులు 24 గంటలు ఓపెన్ చేసి ఉంటాయని తెలిపారు. 10 గంటలు దాటిన తర్వాత ఎటువంటి వాహనాలు, మనుషులు తిరగడానికి అనుమతి లేదని చెప్పారు. తిరుమలకు వెళ్లే వాహనాలను మాత్రం బైపాస్ రోడ్డు గుండా వెళ్లడానికి అనుమతి ఇచ్చారు.

జిల్లాల్లో అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 5000 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుమలలో ప్రతి రోజు 300 నుంచి 400 కేసులు నమోదవుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుంచే లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కొన్ని దుకాణాలు మాత్రం మినహాయించి మిగతా అన్నింటినీ మూసివేశారు.

అయితే రోడ్ల మీద వాహనాలు యధావిధిగా తిరుగుతున్నాయని..రేపటి నుంచి ఏ మాత్రం తిరగటానికి అవకాశం లేకుండా పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయనున్నారు. 14 రోజుల పాటు ఈ నిబంధనలు ఉంటాయని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరుపతిలో విస్తృతంగా వాహనాల రాకపోకలు పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు రావడం కారణంగా మళ్లీ లాక్ డౌన్ విధించారు.