లాక్‌డౌన్‌లోనూ ఆగని అత్యాచారాలు, గుంటూరులో 10ఏళ్ల బాలికపై అఘాయిత్యం

దిశ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఉరి శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచులు దురాఘతాలకు ఒడిగడుతున్నారు. లాక్ డౌన్ సమయంలోనూ దేశంలో ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చాలా స్ట్రిక్ట్ గా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని చోట్ల కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. హైదరాబాద్ లో మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం మరువక ముందే ఏపీలోని గుంటూరు జిల్లాలోనూ అలాంటి ఘోరం జరిగింది.
ఒంటరిగా ఉన్న బాలికను ఎత్తుకెళ్లి:
అభంశుభం తెలియని పదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన మరియానందం (48) అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తండ్రి మూడేళ్ల కిందట చనిపోయాడు. తల్లి కూలీ పనులు చేస్తూ ముగ్గురు కూతుళ్లు, కొడుకుని పోషిస్తోంది. గురువారం(ఏప్రిల్ 23,2020) మధ్యాహ్నం బాలిక ఇంట్లో వారంతా మిర్చి కోతలకు వెళ్లారు. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదనుగా మరియానందం బాలికను బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం పనులకు వెళ్లి వచ్చిన తల్లికి బాలిక విషయాన్ని తెలిపింది. తల్లి ఫిర్యాదు మేరకు నకరికల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మరియానందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
కామాంధుడిని కఠినంగా శిక్షించాలి:
ఈ ఘటనతో కుటుంబసభ్యులు, స్థానికులు షాక్ అయ్యారు. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్న పాపపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దన్నారు. చుట్టుపక్కల ఉండే వ్యక్తులపైనా ఓ కన్నేసి ఉంచాలన్నారు. వారి ప్రవర్తనలో ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే అప్రమత్తం కావాలన్నారు. వీలైనంత వరకు పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లకపోవడమే మంచిదన్నారు.