Visakha Development: పదేళ్లు చాలు.. విశాఖ అభివృద్ధిపై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రంలోనే తొలి ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన..

పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని చెప్పారు. 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని అన్నారు.

Visakha Development: పదేళ్లు చాలు.. విశాఖ అభివృద్ధిపై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రంలోనే తొలి ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన..

Updated On : October 12, 2025 / 6:03 PM IST

Visakha Development: హైదరాబాద్ అభివృద్ధికి 30ఏళ్లు పడితే విశాఖ అభివృద్ధికి పదేళ్లు సరిపోతుందన్నారు మంత్రి నారా లోకేశ్. హైదరాబాద్ స్థాయిలో వైజాగ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు లోకేశ్. సూపర్ సిక్స్ లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యం అన్నారు. ఐటీ మంత్రిగా విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

టీసీఎస్ కు తక్కువ ధరకు భూముల కేటాయింపుపై కొందరు కోర్టుకి వెళ్లారన్న లోకేశ్.. టీసీఎస్ కు కేటాయింపుల తర్వాత అనేక సంస్థలు ఏపీకి క్యూ కట్టాయని వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఉత్తమ విధానాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని చెప్పారు. 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని అన్నారు. త్వరలో రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి సర్కార్. విశాఖను టెక్నాలజీ హబ్ గా మార్చే ప్రయత్నంలో భాగంగా కీలక ముందడుగు పడింది. ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. ఇవాళ విశాఖలో పర్యటించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు.

కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. డేటా సెంటర్ల హబ్ గా విశాఖ రూపుదిద్దుకోబోతోంది. విశాఖలో 5లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్న లోకేశ్.. ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.

ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాకతో భారత్ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోబోతుండటంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయబోతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో 15వేల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి చేయబోతోంది. తద్వారా వెయ్యి మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం కల్పిస్తుంది. ఇక భారత్ తో పాటు ఆగ్నేయ ఆసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ సీఎల్ఎస్ (ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్) వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్ గా పని చేస్తుంది.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త యాప్ వచ్చేస్తోంది.. ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు.. వాళ్ల బండారం బయటపడినట్లే..