Nara Lokesh: అది క్షమించరాని నేరం, వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే..- జగన్‌కు మంత్రి లోకేశ్ సీరియస్ వార్నింగ్
అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.

Nara Lokesh: అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన తల్లులను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్ర మహిళలను అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తామన్నారు.
దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్ పనిపడుతుందన్నారు. మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారని లోకేశ్ గుర్తు చేశారు. మహిళలను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. జగన్ మీడియాలో అంత ఘోరంగా మహిళలను అవమానించవచ్చా? అని మంత్రి నారా లోకేశ్ నిలదీశారు.
Also Read: తల్లికి వందనం నగదు పంపిణీ… 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలపై చంద్రబాబు కీలక ప్రకటన
అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుందన్నారు. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని హెచ్చరించారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అని లోకేశ్ స్పష్టం చేశారు.
”భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి.
కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుంది? విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నాం. మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడ్వొద్దు, మేమేమీ గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు” అని వార్నింగ్ ఇచ్చారు నారా లోకేశ్.