Minister Roja : మరోసారి సొంత పార్టీ నేతల నుంచే మంత్రి రోజాకు నిరసన సెగ, గ్రామ సచివాలయానికి తాళం
మంత్రి రోజాకు మరోసారి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. మంత్రి ప్రారంభించాల్సి ఉన్న గ్రామ సచివాలయానికి తాళం వేశారు వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి.

Minister Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాకు తన సొంత నియోజకవర్గంలో మరోసారి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. మంత్రి ప్రారంభించాల్సి ఉన్న గ్రామ సచివాలయానికి తాళం వేశారు వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. దీంతో జెడ్పీటీసీపై దాడికి యత్నించారు రోజా అనుచరులు. సచివాలయ భవనం తాళాలు పగలకొట్టి బలవంతంగా భవనం తెరిచారు రోజా అనుచరులు.
సచివాలయ నిర్మాణ ఖర్చులు రూ.25లక్షలు పెండింగ్ లో ఉన్నాయని, నిధులు మంజూరు చేయకుండా భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. అయితే, సచివాలయ భవనానికి తాళం వేసిన ఘటనపై మంత్రి రోజా స్పందించారు. బెదిరించి బిల్లులు తీసుకుని మంజూరు కాలేదని చెబుతున్నారని మండిపడ్డారు. అన్యాయం చేశారని చెప్పడం బాధాకరం అన్నారు రోజా.
నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే తరచూ నిరసనలు ఎదురవుతున్నాయి. వైసీపీ నేతలు ఆమెకు తలనొప్పిగా మారారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో మంత్రి రోజా ప్రస్తావించారు. తనకు వ్యతిరేకంగా పని చేయడం కరెక్ట్ కాదన్నారు. తాజాగా తిరుపతి జిల్లా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు సచివాలయాన్ని ప్రారంభించేందుకు మంత్రి రోజా వెళ్లగా.. వైసీపీ జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మంత్రి రోజా పర్యటనపై అభ్యంతరం తెలిపారు.
ఒకే ప్రాంగణంలో సచివాలయం, ఆర్బీకే, పాల శీతలీకరణ కేంద్రాన్ని రూ.34 లక్షలు వ్యయంతో నిర్మించామని మురళీధర్‌రెడ్డి తెలిపారు. నిర్మాణ ఖర్చుల్లో ఇంకా రూ.23 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండగానే మంత్రి రోజా హడావుడిగా ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాకే భవనాలను ప్రారంభించాలని తాళాలు వేశారు. అంతేకాదు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని మురళీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
అయితే మంత్రి రోజా అనుచరులు భవన సముదాయం తాళం పగలగొట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అనంతరం జడ్పీటీసీ మురళీధర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు రవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమే మంత్రి రోజా సచివాలయాన్ని ప్రారంభించారు.
అసలేం జరిగిందంటే..
నగరి పరిధిలోని వడమాలపేట మండలం పత్తిపుత్తూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు రోజా వెళుతున్న సమయంలో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరిలో రోజాకు వ్యతిరేకంగా వైసీపీలో ఓ వర్గం తమ పరిధిలోని గ్రామాల్లోకి రోజాను రానివ్వకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వడమాలపేట మండల జడ్పీటీసీగా కొనసాగుతున్న మురళీధర్ రెడ్డి… రోజాకు వ్యతిరేక వర్గంలో ఉన్నారు. రోజా తన మండలానికి వస్తున్నారన్న సమచారం అందుకున్న ఆయన తన సోదరుడు రవి రెడ్డితో కలిసి పత్తిపుత్తూరు వెళ్లారు. అక్కడ రోజా చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న గ్రామ సచివాలయ భవనానికి ఆయన తాళం వేశారు. ఈ భవనాన్ని తానే నిర్మించానని, అయితే అందుకు సంబంధించిన బిల్లులు ఇంకా విడుదల కాలేదని.. బిల్లులు ఇప్పించిన తర్వాతే తాళం తీస్తానని ఆయన భీష్మించారు.
అయితే అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న రోజా వర్గీయులు మురళీధర్ రెడ్డి వర్గీయులతో ఘర్షణకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. రోజా అనుచరులు గ్రామ సచివాలయ భవనానికి వేసిన తాళాన్ని పగులగొట్టారు. ఆ తర్వాత గ్రామానికి చేరుకున్న మంత్రి రోజా గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.